మరో మూడు నెలల్లో రెండేళ్లు

26 Dec, 2019 01:03 IST|Sakshi
శ్రియ

గత ఏడాది మార్చిలో బ్యాచిలర్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టారు శ్రియ. తన బాయ్‌ఫ్రెండ్, రష్యాకు చెందిన బిజినెస్‌మ్యాన్‌ ఆండ్రూ కోచీవ్‌ను పెళ్లాడారామె. కానీ ఈ వేడుక అతికొద్ది మంది స్నేహితులతో, పెద్ద హడావిడి లేకుండా జరిగింది. వివాహం విషయంలో అంత గోప్యత పాటించడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నను శ్రియ ముందుంచితే – ‘‘ఆండ్రూతో వివాహం అయి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తి కావస్తోంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. మా పెళ్లిని రహస్యంగానో, చాటుగానో ఉంచాలనుకోలేదు.

పెళ్లనేది నాకు, ఆండ్రూకి జరిగిన చాలా వ్యక్తిగతమైన విషయం. మా వ్యక్తిగత విషయం మా మధ్యనే ఉండాలనుకున్నాం. అంతకు మించి వేరే కారణం ఏం లేదు. సినిమాలు నా వృత్తి. ఆ విషయంలో మా ఆయన చాలా సపోర్ట్‌గా ఉన్నారు. నేను ఎక్కువ సినిమాలు చేయాలంటున్నారు ఆయన’’ అని పేర్కొన్నారు. భర్తతో విదేశాల్లో నివసిస్తున్నారు శ్రియ. ‘‘ముంబైలో ఉంటున్న మా అమ్మానాన్న దగ్గరకు వచ్చి వెళుతుంటాను. అలాగే సినిమాల షూటింగ్‌ ఎక్కడ ఉంటే అక్కడికి వెళతాను. నేను ఎక్కడ ఉన్నా షూటింగ్స్‌కి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను’’ అన్నారు శ్రియ.

మరిన్ని వార్తలు