ఆండ్రీ దొరకడం నా అదృష్టం

15 Feb, 2020 01:46 IST|Sakshi
శ్రియ

‘‘నా జీవితంలో జరిగిన మంచి విషయాల్లో ఆండ్రీతో పెళ్లి ఒకటి అని భావిస్తున్నాను. ఆండ్రీలాగా సపోర్ట్‌ చేసే భర్త దొరకడం నా అదృష్టం’’ అని భర్తను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు శ్రియ. 2018లో ఆండ్రీ కొచ్చివ్‌ అనే బార్సిలోనా టెన్నిస్‌ ప్లేయర్‌ను వివాహం చేసుకున్నారామె. వివాహం తర్వాత తన భర్త గురించి ఎక్కువగా మాట్లాడింది లేదు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, పలు విషయాలు పంచుకున్నారు శ్రియ. ‘‘వ్యక్తిగత విషయాలు బయటకి మాట్లాడటానికి నేను పెద్దగా ఇష్టపడను. అందుకే ఆండ్రీ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. మేం మొదటిసారి మాల్దీవ్‌స్‌లో కలిశాం. అప్పటికి నేనో నటిని అని ఆండ్రీకి తెలియదు. నేను నటిని అని తెలిశాక ఆన్‌లైన్‌లో నా సినిమాలు కొన్ని చూశాడు.

నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే... ‘అర్జున్‌’ సినిమాలో ఒక పాటను సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో షూట్‌ చేశాం. నేను ఆ సంగతే మర్చిపోయాను. మేం కలిసిన కొత్తలో నన్ను ఆ ప్లేస్‌కి తీసుకెళ్లి నువ్వు ఇక్కడే పాట పాడావు, డ్యాన్స్‌ చేశావు అని ఆ పాటలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకుని నాకు చెప్పాడు. ఆ విషయం నాకు బాగా నచ్చింది. అలానే బెస్ట్‌ వేలంటైన్స్‌ డే అంటే గత ఏడాది ‘ది నట్‌క్రాకర్‌’ అనే షోకి తీసుకెళ్లాడు. ఆ షోను ఇద్దరం బాగా ఎంజాయ్‌ చేశాం. అది మర్చిపోలేని రోజు’’ అన్నారు శ్రియ. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో స్పెషల్‌ రోల్‌ చేస్తున్నారామె. ఇది కాకుండా మరో తెలుగు సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు