ఈసారి మరో ఆగంతకుడు!

13 Jun, 2014 23:59 IST|Sakshi
ఈసారి మరో ఆగంతకుడు!

వరుస విజయాలతో దూసుకుపోతున్నా... శ్రుతిహాసన్‌కి మాత్రం ఒడుదొడుకులు తప్పడం లేదు. ఏదో ఒక రూపంలో ఈ ముద్దుగుమ్మకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఓ ఆగంతకుడు ముంబాయ్‌లోని ఆమె ఇంట్లోకి చొరబడి నానా హంగామా సృష్టించాడు. ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. అలాగే ఆమధ్య... తన ప్రమేయం లేకుండానే శ్రుతి హాట్ స్టిల్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసి, అన్ని చానల్స్‌లో హడావిడి చేశాయి. ఈ విషయమై శ్రుతి పోలీసుల దాకా వెళ్లారు. రీసెంట్‌గా మరో కొత్త ఇబ్బంది శ్రుతీని వెంటాడింది. వివరాల్లోకెళ్తే -ప్రస్తుతం శ్రుతీహాసన్ బాలీవుడ్‌లో ‘యారా’ అనే సినిమాలో నటిస్తున్నారు.

తిగ్మన్షు ధూలియా దర్శకుడు. ఇర్ఫాన్‌ఖాన్ కథానాయకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరి పరిసరాల్లో జరుగుతోంది. అక్కడే ఓ హోటల్‌లో శ్రుతి బస చేశారు. టైమ్ అర్థరాత్రి దాటింది. ఇంతలో తలుపు దబా దబా మోత. ఎవరో బలంగా తలుపును కొడుతున్నారు. శ్రుతికి గుండె ఆగినంత పనైంది. గతంలో జరిగిన చేదు అనుభవం మరిచిపోక ముందే మరో దుశ్చర్య.

వెంటనే శ్రుతి తెలివిగా వ్యవహరించి, హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసింది. వెంటనే వారందరూ అప్రమత్తమై ఆ దుండగుణ్ణి పట్టుకున్నారు. పోలీస్ కేస్ కూడా నమోదు చేశారు. సిర్సా ప్రాంతానికి చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఈ విధంగా తలుపును మోదాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. విషయం ఏంటంటే... ఆ వ్యాపార వేత్త శ్రుతి వీరాభిమానట. మద్యం మత్తులో అలా చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా శ్రుతికే ఇలాంటివి జరగడం నిజంగా బాధాకరమే.