నో స్క్రిప్ట్‌ నోరీటేక్స్‌

22 Jun, 2018 00:15 IST|Sakshi
‘ది మస్కిటో ఫిలాసఫీ’ పోస్టర్‌ , శ్రుతీహాసన్‌

కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు కథానాయిక శ్రుతీహాసన్‌. కానీ హీరోయిన్‌గా కాదు. నిర్మాతగా. అయితే సినిమా పూర్తయ్యాక నిర్మాతగా కమిట్‌ అయ్యారు. విచిత్రంగా ఉంది కదూ. విషయంలోకి వస్తే... ఇసిడ్రో ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘లెన్స్‌’ ఫేమ్‌ జయప్రకాశ్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ది మస్కిటో ఫిలాసఫీ’. ఈ సినిమాకే నిర్మాతగా ముందుకొచ్చారు శ్రుతీ. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, హీరోయిన్‌గా సక్సెస్‌ సాధించిన శ్రుతీ ఇప్పుడు నిర్మాతగా కూడా విజయం సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

‘‘ఇంట్రెస్టింగ్‌ అండ్‌ డిఫరెంట్‌  కంటెంట్‌ సినిమాలను ఇసిడ్రో ప్రొడక్షన్స్‌ ద్వారా ఆడియన్స్‌కు అందించాలనుకుంటున్నాం. ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అలాంటి చిత్రమే అని నమ్ముతున్నాం. ‘లెన్స్‌’ వంటి మంచి చిత్రం తీసిన జయప్రకాశ్‌తో అసోసియేట్‌ అవ్వడం ఆనందంగా ఉంది. ఆయన స్టోరీ టెల్లింగ్‌ కొత్తగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్‌. అలాగే ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్‌ చేశారామె.  ఆ పోస్టర్‌పై ‘నో స్క్రిప్ట్‌.. నో రీటేక్స్‌’ అని ఉండటం విశేషం. చిత్రదర్శకుడు జయప్రకాశ్‌ మాట్లాడుతూ–‘‘రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను ఆడియన్స్‌కు అందించాలని నిర్మాతలు కోరుకుంటారు.

అలా గుడ్‌ కంటెంట్‌తో ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యే సినిమానే ‘ది మస్కిటో ఫిలాసఫీ’. ట్రెడిషన్‌ అండ్‌ మోడ్రనిటీ బ్యాక్‌డ్రాప్‌లో నలుగురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. స్క్రిప్ట్, డైలాగ్స్‌ లేకుండా చిత్రీకరించాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘సారిక (నటి, శ్రుతీహాసన్‌ తల్లి) మేడమ్‌తో ఈ సినిమా గురించి చెప్పాను. ఆ తర్వాత శ్రుతీహాసన్‌గారి ఇసిడ్రో మీడియా మూవీ బోర్డ్‌లోకి వచ్చింది. నా టాలెంట్‌ అండ్‌ విజన్‌ని నమ్మినందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు