అది నా అదృష్టం

9 Jul, 2018 01:00 IST|Sakshi
శ్రుతీహాసన్‌

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్‌. తండ్రి కమల్‌హాసన్‌కు తగ్గ తనయగా మార్కులు కొట్టేస్తూనే, సొంత అభిమానులను సంపాదించుకున్నారామె. కథానాయికగా డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకు వెళుతోన్న శ్రుతిలో మ్యూజిక్‌ కంపోజింగ్‌ టాలెంట్‌ కూడా ఉందని ప్రత్యేకించి చెప్పకర్లేదు. యాక్టింగ్, మ్యూజిక్‌వైజ్‌గా మీ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది? అన్న ప్రశ్నను శ్రుతీ ముందు ఉంచితే– ‘‘మా నాన్నగారు నటించి, దర్శకత్వం వహించిన ‘హే రామ్‌’లో నేను ఓ గెస్ట్‌ రోల్‌ చేశాను. అయితే నటిగా అది నాకు మొదటి సినిమా అని నేను అనుకోవడంలేదు.

కానీ ఆ సినిమాతో కెమెరా ముందుకు వచ్చినందుకు ఫుల్‌ హ్యాపీ. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్‌లో ‘లక్‌’ మూవీ చేశాను. యాక్టర్‌గా నా తొలి మూవీ అదే. సినిమా ప్రపంచాన్ని నా కళ్లు అర్థం చేసుకుంది అప్పుడే. అందుకే ‘లక్‌’ని నా మొదటి సినిమాలా భావిస్తున్నాను. యాక్టర్‌గా నా జర్నీ బాగుంది. ఇక మ్యూజిక్‌ కంపోజింగ్‌ అనేది నా న్యాచురల్‌ ఎక్స్‌టెన్షన్‌. సాధారణంగా చాలామందిలో యాక్టింగ్‌ లేదా మ్యూజిక్‌ ఏదో ఒక టాలెంట్‌ మాత్రమే ఉంటుంది. కానీ ఆ రెండింటినీ నేను చేయగలుగుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ హిందీ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో హీరో విద్యుత్‌ జమాల్‌.

మరిన్ని వార్తలు