అబ్బాయిలను సరిగ్గా పెంచమని విన్నవించుకుంటున్నా!

31 Jan, 2016 23:11 IST|Sakshi
అబ్బాయిలను సరిగ్గా పెంచమని విన్నవించుకుంటున్నా!

‘‘ఆడవాళ్లు అర్ధరాత్రి కూడా క్షేమంగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారు. అది నిజమే. అయితే అర్ధరాత్రి కాదు కదా.. రాత్రి తొమ్మిదీ, పది గంటలకు కూడా తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. పగలు మాత్రమే కాదు.. రాత్రి కూడా నిర్భయంగా తిరగగల మార్పుని చూడాలని కోరుకుంటున్నా’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఆడవాళ్ల రక్షణ గురించి ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘‘సేఫ్టీగా, స్వేచ్ఛగా జీవించడం నా హక్కు. నేను ఎవరి కూతుర్ని అన్నది ముఖ్యం కాదు. నేను ఒంటరి ఆడపిల్లను. ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లానుకుంటాను. నచ్చిన ప్లేసెస్‌కి వెళ్లి, ఎంజాయ్ చేయాలనుకుంటాను. ఎక్కడికి వెళ్లినా సేఫ్టీ ముఖ్యం’’ అని శ్రుతి పేర్కొన్నారు.

ఆడవాళ్ల రక్షణ గురించి ఇంకా ఆమె మాట్లాడుతూ - ‘‘తమ కుటుంబానికి చెందిన ఆడవాళ్లు సేఫ్‌గా ఉండాలని మగాళ్లందరూ కోరుకుంటారు. బయటి మగవాళ్లు తన అమ్మ, అక్కచెల్లెళ్లను గౌరవించాలని అనుకుంటారు. అదే విధంగా బయటి ఆడవాళ్లను కూడా తాము గౌరవించాలని వాళ్లు అనుకుంటే బాగుంటుంది. ఆడపిల్లలకు ఆంక్షలు పెట్టి, పెంచే తల్లిదండ్రులు మగపిల్లలను కూడా అలానే పెంచాలి. స్త్రీ విలువ చెప్పి పెంచితే పరాయి స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించరు. అందుకే ఆడవాళ్లందరూ తమ కొడుకులను సరిగ్గా పెంచాలని విన్నవించుకుంటున్నా... బతిమాలుకుంటున్నా’’ అని శ్రుతీహాసన్ అన్నారు.

పాయింటే కదా.. ఏ వ్యక్తి స్వభావం అయినా కొంతవరకూ తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శ్రుతి చెప్పినట్లు ఆడపిల్లలను మాత్రమే కాదు.. మగపిల్లలను కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచాలి.