ఆ వార్తలో నిజం లేదు!

16 Aug, 2016 23:31 IST|Sakshi
ఆ వార్తలో నిజం లేదు!

‘‘మా నాన్నతో కలసి నటించే అవకాశం వస్తే అంతకన్నా సంతోషపడే విషయం మరొకటి ఉండదు’’ అని శ్రుతీహాసన్ పలు సందర్భాల్లో చెప్పారు. ‘శభాష్‌నాయుడు’ చిత్రంతో అది నెరవేరింది. కమల్ కూతురిగా ఈ చిత్రంలో శ్రుతి నటిస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా కమల్‌హాసన్ నటించే అన్ని చిత్రాలకూ నటి, కమల్‌కి అత్యంత సన్నిహితురాలూ అయిన గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ చిత్రానికి కూడా ఆమె ఆ బాధ్యత నిర్వరిస్తున్నారు.
 
 కాగా, కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమి-శ్రుతి మాటా మాటా అనుకున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ లాస్ ఏంజిల్స్‌లో పెరిగే అమ్మాయిగా నటిస్తున్నారు. షూటింగ్ ఆరంభించక ముందు జరిగిన లుక్ టెస్ట్ కోసం గౌతమి తెచ్చిన డ్రెస్సుల్లో కొన్ని శ్రుతీకి అంత బాగా లేవనిపించాయట.
 
  మామూలుగా ఏ ఆర్టిస్ట్ అయినా తమ కాస్ట్యూమ్స్ గురించి దర్శక-నిర్మాతలు, కాస్ట్యూమ్ డిజైనర్‌తో డిస్కస్ చేస్తుంటారు. అలా ఈ చిత్రం కోసం గౌతమి కాస్ట్యూమ్స్ తెచ్చినప్పుడు బెటర్‌మెంట్ కోసం శ్రుతి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారట. గౌతమి కూడా శ్రుతి అభిప్రాయాన్ని ఆమోదించి, మరికొన్ని డ్రెస్సులు తయారు చేయించారట. ఇదంతా స్నేహపూరిత వాతావరణంలో జరిగినప్పటికీ గౌతమి, శ్రుతి మాటా మాటా అనుకున్నారని ఎవరో ప్రచారం మొదలు పెట్టారు. శ్రుతీహాసన్ తన పీఆర్ (పబ్లిక్ రిలేషన్) ద్వారా ‘అదేం లేదు’ అని స్పష్టం చేశారు.
 
  గౌతమి, శ్రుతి మధ్య మంచి అనుబంధం ఉందనీ, గౌతమిని తమ కుటుంబ సభ్యులలో ఒకరిలా శ్రుతి భావిస్తారని పీఆర్ టీమ్ పేర్కొంది. వాస్తవానికి కమల్‌హాసన్-గౌతమి ఒకే ఇంట్లో కలసి ఉంటున్నప్పటికీ శ్రుతి, అక్షర ఆ విషయంలో ఫీలైన దాఖలాలు కనిపించవ్. శ్రుతి అయితే ‘మా నాన్న అభిప్రాయాలను గౌరవిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గౌతమితో కూడా శ్రుతి, అక్షరలకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో గౌతమీతో తనకు మనస్పర్థలు వచ్చాయనే వార్త శ్రుతికీ బాధ కలిగించి ఉంటుంది. అందుకే ఇది కేవలం వదంతి మాత్రమే అని ఆమె స్పష్టం చేసి ఉంటారు.