నా దేహమే దేవాలయం

11 Nov, 2014 02:01 IST|Sakshi
నా దేహమే దేవాలయం

నా దేహం దేవాలయం లాంటిది. ఎవరి కోసమో నేను మారను అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఇంతకు ఈ బ్యూటీ దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమిటా కథా చూద్దామా? ప్రస్తుతం హాట్ హీరోయిన్ అంటే ఈ ముద్దుగుమ్మనే. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. అయితే శ్రుతిహాసన్ రూటేవేరు. మొదట పరభాషల్లో విజయకేతనం ఎగురవేసి ఆ తర్వాత సొంత గడ్డపై విజయం సాధించారు. అదే విధంగా కోలీవుడ్‌లో ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకునేంతగా ఎదిగారు. అదే విధంగా తాను ఒక భాషకు పరిమితమయిన నటిని కాదు భారతీయ నటినని గర్వంగా చెప్పుకుంటున్న శ్రుతి, తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడిస్తారు.

గ్లామర్ అంటే అర్థం ఏమిటని ప్రశ్నించే ఈ జాణ అందాల ఆరబోత విషయంలో విమర్శలను మూట గట్టుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో శ్రుతిహాసన్ వివరణ ఏమిటో ఆమె మాటల్లోనే చూద్దాం.... నా దేహం దేవాలయం లాంటిది. దాన్ని ఎవరు ఎలా చూసినా నాకు అభ్యంతరం లేదు. అందాల ఆరబోత అంటూ కొందరు గగ్గోలు పెడుతున్న విషయం నాకు తెలుసు. అయితే కొన్ని చిత్రాలకు గ్లామరనేది చాలా అవసరం. పాత్రల స్వభావాన్ని బట్టి గ్లామర్ మోతాదు ఉంటుంది. దాన్ని కొందరు కోరుకుంటున్నారు. మరికొందరు ఇష్టపడటం లేదు. ఏదేమయినా ఎవరి కోసమో తాను తన వైఖరిని, నైజాన్ని మార్చుకోవలసిన అవసరం లేదు అని తేల్చేశారు.