స్ఫూర్తి శ్రుతి

5 Jul, 2020 06:10 IST|Sakshi
శ్రుతీహాసన్‌

‘‘మనకు మనం ప్రేరణగా నిలవలేనప్పుడు ఇతరుల్లో ఆ ప్రేరణను వెతుక్కోవాలి. ఇతరులకు ఆదర్శవంతంగా ఉండేవారిని అనుసరించాలి. వారిని స్ఫూర్తిగా తీసుకుని మన ఆశయాలను సాధించాలి’’ అంటోంది ఓ అమ్మాయి. శ్రుతీహాసన్‌ అంటే ఆ అమ్మాయికి చాలా అభిమానం. ఆ అభిమానమే ఆమెను ఓ చెడు అలవాటుకి దూరం చేసింది. ఒత్తిడిని అధిగమించడానికి ఆ అమ్మాయి రోజుకి 20 సిగరెట్లు కాల్చేది. అయితే ఆరోగ్యానికి అది అంత మంచిది కాదని తనకు తెలుసు. ఆమె ఈ అలవాటు మానుకోవడానికి శ్రుతి ఎలా కారణంగా నిలిచారంటే.. శ్రుతీహాసన్‌ చేసే ప్రైవేట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్స్, తన గురించి చదివిన కొన్ని కథనాలు ఆ అమ్మాయికి స్ఫూర్తినిచ్చాయి. సిగరెట్‌ తాగడంకన్నా శ్రుతి  పాటలు, కథనాలు తనకు రిలీఫ్‌నిచ్చాయంటోంది.

పైగా శ్రుతీహాసన్‌ నవ్వుతున్న ఫొటోలను చూస్తుంటే ఎక్కడ లేని పాజిటివిటీ వచ్చేస్తుందని ఆ అభిమాని పేర్కొంది. ఇవన్నీ ఆమె ధూమపానానికి దూరం కావడానికి కారణం అయ్యాయి. ‘‘నా జీవితంలో ఆశావహ దృక్పథానికి కారణమైన మీకు కృతజ్ఞతలు శ్రుతి. నేను బెటర్‌ పర్సన్‌ కావడానికి స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు. శనివారంతో నేను సిగరెట్‌ మానేసి వంద రోజులైంది’’ అని ట్వీట్‌ చేసింది ఆ అమ్మాయి. కాగా గత నెల 12న ధూమపానం మానేసి 78 రోజులు అయిందని ఆ అమ్మాయి చేసిన ట్వీట్‌కి ‘నువ్వు సాధించగలవు. ఇలాగే స్ట్రాంగ్‌గా ఉండు’ అని సమాధానం ఇచ్చారు శ్రుతీహాసన్‌. తాజాగా 100 రోజుల ట్వీట్‌కి స్పందిస్తూ.. పువ్వుల బొమ్మలను పోస్ట్‌ చేసి, ఆ అభిమానిని అభినందించారు శ్రుతి. అభిమాన తారలను స్ఫూర్తిగా తీసుకుని మంచి బాటలో వెళ్లే అభిమానులు ఉంటారు. అందుకు ఇదొక నిదర్శనం.

మరిన్ని వార్తలు