శ్వేత కల్యాణం

2 Dec, 2018 00:14 IST|Sakshi

మొత్తానికి పెళ్లయింది!శ్వేతా బసు ప్రసాద్‌ పెళ్లి కాదు. ప్రియాంక, నిక్‌ల పెళ్లి.అంతకు ముందు కూడా..మొత్తానికి పెళ్లైంది. రణవీర్, దీపికల పెళ్లి.అంతకన్నా ముందూ..మొత్తానికి పెళ్లయింది. అనుష్క, కొహ్లీల పెళ్లి.బాలీవుడ్‌ తారల పెళ్లి డేట్‌లు ఒక పట్టాన కదిలి రావు. అందుకే..‘మొత్తానికి పెళ్లైంది’ అనిపిస్తుంది. శ్వేతాబసు మరీ అంత సాగతీయడం లేదు. డేట్‌ చెప్పారు. డేటింగ్‌ గురించీ చెప్పారు. నచ్చిన వరుడు. మెచ్చిన వధువు. పెళ్లి పనుల్లో ఉండి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. చూతము రారండి.. శ్వేతా కల్యాణం.

త్వరలో ‘మిసెస్‌’ కాబోతున్నందుకు ముందుగా కంగ్రాట్స్‌...
శ్వేత: థ్యాంక్స్‌. ఈ నెల 13న రోహిత్‌తో నా పెళ్లి. అందుకే పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నాం.

అసలు మీ ఇద్దరూ ఫస్ట్‌ టైమ్‌ ఎక్కడ కలిశారు?
దాదాపు ఐదేళ్ల క్రితం కలిశాం. ఫ్యాంథమ్‌ ఫిలిమ్స్‌లో నేను స్క్రిప్ట్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పుడు రోహిత్‌ కూడా వేరే పని మీద అక్కడ ఉన్నాడు. అయితే చాలామంది అనుకుంటున్నట్లు తను అక్కడ పని చేయడం లేదు. అసిస్టెంట్‌గా కూడా వర్క్‌ చేయడం లేదు. తనకు డైరెక్టర్‌ అవ్వాలన్నది లక్ష్యం. ప్రొడ్యూసర్‌గా కూడా చేయాలనే ఎయిమ్‌తో ఉండేవాడు.

మీ ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగిందట కదా?
లేదు. పెళ్లికి ముందు రోజు మెహందీ, ఎంగేజ్‌మెంట్‌ ఉంటాయి. ప్రిన్సెస్‌ కట్‌ డైమండ్‌ రింగ్‌ సెలెక్ట్‌ చేసుకున్నాం.

ఓ మంచి భర్తకు కావాల్సిన లక్షణాలు రోహిత్‌లో ఏం ఉన్నాయి?
ఓపికకు మారు పేరు రోహిత్‌. అలాగే చేసే పని మీద శ్రద్ధ ఎక్కువ. చాలా వినయంగా ఉంటాడు. స్త్రీల దగ్గర తను నడుచుకునే తీరు చాలా బాగుంటుంది. ఆ తీరే నా మనసుని గెలుచుకుంది. రోహిత్‌ది చాలా మంచి పెంపకం.

బాలీలో బ్యాచిలరెట్‌ పార్టీ చేసుకున్నట్లున్నారు. ఆ ప్లేస్‌నే సెలెక్ట్‌ చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?
పార్టీకి అద్భుతమైన ప్లేస్‌ అది. అందుకే వెళ్లాం.  గత నెల 25 నుంచి 30 వరకూ అక్కడే ఉన్నాం. శుక్రవారం రాత్రి ముంబై చేరుకున్నాం. బాలీలో ఓ ప్రైవేట్‌ విల్లాని బుక్‌ చేసుకున్నాం. మా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో వెళ్లాం. ముఖ్యంగా నన్ను బాగా ప్రేమించేవాళ్లతో ఈ పార్టీ చేసుకున్నాను. ఫుల్‌గా రిలాక్స్‌ అవ్వాలనే ఆలోచనతోనే ఈ పార్టీ ప్లాన్‌ చేశాను. బాలీ పొలాల్లో ఫార్మింగ్‌ చేశాం. అలాగే పొలాల్లో వంటలు చేసుకున్నాం. ఒకట్రెండు రోజులైతే విల్లా నుంచి బయటికి రాలేదు కూడా. బోర్డ్‌ గేమ్స్‌ ఆడుకున్నాం. నా బ్రదర్‌ రాహుల్‌ ప్లే చేసిన మ్యూజిక్‌కి డ్యాన్స్‌ చేశాం. ఫుల్‌గా రిలాక్స్‌ అయ్యాను.

మీ ఇద్దరూ పేరెంట్స్‌ని ఒప్పించడానికి కష్టపడ్డారా? 
నా కుటుంబ సభ్యులకు రోహిత్‌ మూడేళ్లుగా తెలుసు. నాక్కూడా తన ఫ్యామిలీతో అన్నేళ్ల అనుబంధం ఉంది. మేమంతా ఒకే కుటుంబం అన్నట్లుగా ఉండటం మొదలుపెట్టాం. ఏ బంధంలో అయినా గౌరవం ఉంటే ఆ బంధం బలంగా ఉంటుంది. మాకు ఒకరి కుటుంబం అంటే మరొకరికి గౌరవం ఉంది. మా పెద్దలు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. అందుకే మా ప్రేమ గురించి చెప్పగానే కాదనలేదు.

మరి.. సహజీవనం చేశారు కదా.. అప్పుడు కూడా ఏమీ అనలేదా?
లేదు. దాదాపు రెండేళ్లు సహజీవనం చేశాం. మా నిర్ణయాల మీద మావాళ్లకు నమ్మకం ఉంది. అందుకే ఏమీ అనలేదు.

పెళ్లి తర్వాత కెరీర్‌ కంటిన్యూ చేస్తారా?
డెఫినెట్‌గా. రోహిత్‌కి అభ్యంతరం లేదు. పెళ్లయితే కెరీర్‌ని వదిలేసుకోవాలన్న మైండ్‌సైట్‌ నాకూ లేదు. నా మనవళ్లు, మనవరాళ్లు పుట్టేటప్పటికి కూడా నేను నటిస్తూనే ఉంటా (నవ్వుతూ).

ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
హిందీ చిత్రం ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’లో నటించాను. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నసీరుద్దీన్‌ షా, మిథున్‌ చక్రవర్తి, నేను, ఇంకొంతమంది ప్రముఖ స్టార్స్‌ నటించాం. మన రెండో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిగారి డెత్‌ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ‘జామున్‌’ అని మరో సినిమా చేశాను. తండ్రీ కూతురి అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నా తండ్రిగా రఘుబీర్‌ యాదవ్‌ నటించారు. ఈ రెండూ వచ్చే ఏడాది విడుదలవుతాయి.

ఫైనల్లీ... విష్‌ యు హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌?
థ్యాంక్యూ వెరీ మచ్‌. నన్ను కథానాయికను చేసిన తెలుగు పరిశ్రమ అన్నా, తెలుగు ప్రేక్షకులన్నా నాకు చాలా అభిమానం.

ఎవరీ రోహిత్‌? 
పూణేకు చెందిన బిజినెస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చారు రోహిత్‌ మిట్టల్‌. వాళ్ల నాన్నగారు బిల్డర్‌. రోహిత్‌ లా పూర్తి చేసినప్పటికీ ఫిల్మ్‌ మేకింగ్‌ మీద శ్రద్ధతో లాస్‌ ఏంజెల్స్‌లో న్యూయార్క్‌ అకాడమీలో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో దర్శక–నిర్మాతగా కొనసాగుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ‘ఆటోహెడ్‌’ అనే ఫీచర్‌ ఫిల్మ్‌ డైరెక్ట్‌ చేశారు. ఆ సినిమాకు కో–ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు రోహిత్‌. బాలీవుడ్‌లో చేయబోయే నెక్ట్స్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ కూడా పూర్తయింది. 

ఎ... క్క...డ...??
ఎ..క్క..డ?? ఎ..క్క..డ..? అంటూ ఓ కొత్త డైలాగ్‌ మాడ్యులేషన్‌తో ‘కొత్త బంగారు లోకం’ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు శ్వేతా బసు. ఈ సినిమా రిలీజ్‌ అయి పదేళ్లు పూర్తయింది. అక్టోబర్‌ 9, 2008లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా గురించి శ్వేతా మాట్లాడుతూ – ‘‘పదేళ్ల క్రితం ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. సెన్సేషనల్‌ రొమాంటిక్‌ హిట్‌. పాటలు, సంభాషణలు అన్నీ కూడా యూత్‌కి ఇట్టే కనెక్ట్‌ అయిపోయాయి. కమర్షియల్‌ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. తెలుగులో నా ఫస్ట్‌ స్టెప్‌ ఓ స్వీట్‌ మెమరీ’’ అని పేర్కొన్నారు.

పెళ్లి ఎక్కడ?
రోహిత్‌ది పుణె. శ్వేత ఫ్యామిలీ ముంబైలో ఉంటుంది. పెళ్లి వేడుక పుణేలో జరుగుతుంది. రిసెప్షన్‌ మాత్రం పుణె, ముంబైలలో జరుగుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, రిసెప్షన్‌కి సినిమా పరిశ్రమలోని వారిని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు.

శ్వేత ఇంట్లో పూజలు బాగా చేస్తారు. రోహిత్‌ ఫ్యామిలీకి కూడా దైవభక్తి ఎక్కువే అట. ఈ ఏడాది వినాయక చవితిని ఎప్పటిలానే గ్రాండ్‌గా చేసుకున్నారు శ్వేత. తన ప్రేయసి ఇంట్లో జరిగిన గణేశ్‌ పూజలో రోహిత్‌ పాల్గొన్నారు. అప్పుడు ఇద్దరూ వినాయకుడికి హారతి ఇచ్చిన సందర్భంగా దిగిన ఫొటో ఇది. ఈ కాబోయే దంపతులు అప్పట్లో ఇచ్చిన ఫస్ట్‌ హారతి.  
– డి.జి. భవాని

మరిన్ని వార్తలు