సెన్సార్ బోర్డు సంస్కరణకు శ్యామ్ బెనగళ్ కమిటీ

1 Jan, 2016 18:37 IST|Sakshi
సెన్సార్ బోర్డు సంస్కరణకు శ్యామ్ బెనగళ్ కమిటీ

-  సీబీఎఫ్సీ నిబంధనల మార్పు, మెరుగైన సూచనల కోసం కమిటీ ఏర్పాటుచేసిన కేంద్రం

న్యూఢిల్లీ: కనీసం సినిమా రూపకర్తల వివరణ కోరకుండా ఏకపక్షంగా కట్ చెప్పడాలు, సినిమాలకు సర్టిఫికేషన్ల జారీలో భారీ అవకతవకలు, సభ్యుల మధ్య ఏకాభిప్రాయలేమి తదితర వివాదాలతో గందరగోళంగామారి ఇటు సినీరంగం అటు ప్రభుత్వానికి తలనొప్పిగామారిన నెన్సార్ బోర్డు ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేందుకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సమాయత్తమయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్ సీ) లేదా సెన్సార్ బోర్డు ప్రక్షాళనకు ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగళ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

సృజనాత్మక రంగంగా భావించే సినీరంగంలో సినీమా రూపకర్తలు, సెన్సార్ బోర్డుకు మధ్య సుహ్రుద్భావ వాతావరణం నెలకొల్పాటంటే ఏం చెయ్యాలి? ఫిలిం సర్టిఫికేషన్ జారీలో ఇప్పుడున్నవాటికంటే ఎలాంటి మెరుగైన విధానాలు రూపొందించాలి? తదితర కీలక అంశాలపై బెనగళ్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. ఇందుకోసం వివిధ దేశాల్లో అమలవుతున్న ఫిలం సర్టిఫికేషన్ల విధానాన్ని కూడా పరిశీలించనుంది. ఈ కమిటీలో సభ్యులుగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా, పియూష్ పాండే, భావన సోమయ్య, నైనా లాథ్ గుప్తాలు నియమితులయ్యారు. జనవరి 2 నుంచి రెండు నెలల లోగా కమిటీ తన పనిని పూర్తిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై శ్యామ్ బెనగళ్ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం మేరకు కేంద్రం.. నెన్సార్ బోర్డు నిబంధనలను పునారచన చేయాలనుకుంటున్నదని, తమకు అప్పగించిన బాధ్యతను సకాలంలో నిర్వర్తిస్తామని చెప్పారు.

బోర్డులో వివాదాలు ముదరటంతో 2014లో నాటి సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శ్యాంసన్ సహా 13 మంది సభ్యుల రాజీనామాలు చేశారు. గత ఏడాది ప్రారంభంలో పహలాజ్ నిహలానీ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి బోర్డు తీరు మరింత వివాదాస్పదంగా మారింది. పలువురు సినీ రూపకర్తలు బాహాటంగా సెన్సార్ బోర్డుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సీబీఎఫ్ సీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది.