సమస్యలు సృష్టిస్తున్న శ్యామ్‌

10 Aug, 2017 01:48 IST|Sakshi
సమస్యలు సృష్టిస్తున్న శ్యామ్‌

తమిళసినిమా: నటుడు శ్యామ్‌ పార్టీలో సమస్యలు సృష్టిస్తున్నారట. నటుడు శ్యామ్‌ మంచి నటుడే కాదు బహుభాషా నటుడు కూడా. అదే విధంగా కథానాయకుడు, ప్రతినాయకుడు అన్న భేదం లేకండా నచ్చిన పాత్రలైతే చేయడానికి రెడీ అనే నటుడు శ్యామ్‌. తమిళంలో  8 మెళగవత్తిగళ్‌ చిత్రంతో నిర్మాతగా కూడా మారారు. ఆ చిత్రంలో శ్యామ్‌ విభిన్న గెటప్, వైవిధ్య భరిత నటన అందరిని ఆశ్చర్యపరిచింది.

ఆ పాత్ర కోసం ఆయన పడిన శ్రమ, చేసిన కృషి ఎక్కువే. అయితే చిత్రం ఆయన్ని నిరాశపరిచింది. ఈ విషయం గురించి శ్యామ్‌ బాధ పడింది లేదట. చిత్ర జయాపజయాలు నటుడి ప్రతిభను అంచనా వేయకూడదంటాడీయన. 8 మెళగవత్తిగళ్‌ చిత్రం ప్రేక్షకుల మధ్యకు వెళ్లకపోవడానికి థియేటర్ల మాజమాన్యం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. ఈయన తాజాగా పార్టీ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాను స్టైలిష్‌ పాత్రను పోషిస్తున్నట్లు శ్యామ్‌ తెలిపారు.

ఇక ఒకరోజు దర్శకుడు వెంకట్‌ప్రభు ఫోన్‌ చేసి బ్రదర్‌ వెంటనే బయలుదేరి చెన్నైకి బయలుదేరి రండి అని అని చెప్పారన్నారు. అంతే ఎందుకు?, ఏమిటీ? అన్న ప్రశ్నలు వేయకుండా వెంటనే చెన్నై వచ్చేశానని చెప్పారు. ఒక జాలీ టీమ్‌తో పార్టీ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇందులో సమస్యలు సృష్టించే పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రం తనకు సెకెండ్‌ ఇన్నింగ్స్‌ అవుతుందని భావించవచ్చునని పేర్కొన్నారు. తన అభిమానులు ఆశించే పాత్రను పార్టీ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు.