భారతీయులను విమర్శించిన నటుడు.. నెటిజన్ల మద్దతు

29 Jul, 2019 14:42 IST|Sakshi

‘వెన్‌ యూ ఆర్‌ ఇన్‌ రోమ్‌.. బీ ఏ రోమన్’‌(రోమ్‌ వెళ్తే రోమన్‌ లానే ప్రవర్తించు) అనేది సామెత. అంటే మనం ఏ ప్రాంతానికి వెళ్తున్నామో.. అక్కడి ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ.. మర్యాదగా నడుచుకోవాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇలాంటి విషయాల్లో భారతీయులు మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు బాలీవుడ్‌  టెలివిజన్‌ నటుడు సిద్ధాంత్‌ కార్ణిక్‌. ఈ మధ్యే ఆయన భూటాన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రశాంతతను భంగపరుస్తున్న భారతీయ పర్యాటకులను ఉద్దేశిస్తూ.. ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది.

ఈ వీడియోలో సిద్ధాంత్‌ కొందరు భారత పర్యాటకులను చూపిస్తూ.. ‘వారంతా ఎంత బిగ్గరగా అరుస్తూ మాట్లాడుతున్నారో చూడండి. ఏదో వారి ఇంటి పెరట్లోనో.. హాల్‌లోనో ఉన్నట్లు భావిస్తూ.. బిగ్గరగా మాట్లాడుతూ.. ఇక్కడి ప్రశాంతతను భంగపరుస్తున్నారు. మనం పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు ఈ దేశంలో మనం మన దేశ రాయబారులుగా భావించబడతాం. అలాంటప్పుడు ఇక్కడి ఆచార వ్యవహరాలను గౌరవిస్తూ.. వారి ప్రశాంతతకు భంగం కలగకుండా ప్రవర్తించడం మన విధి. భూటాన్‌లో ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ చాలా మంది భారత పర్యాటకులు కనిపిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. కానీ మన పాత అలవాట్లను ఇక్కడకు తీసుకురావడం మంచిది కాదు. ఇక్కడి ప్రశాంతతను, శుభ్రతను భంగం చేసే హక్కు మనకు లేద’ని తెలిపారు.

ఈ వీడియో పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పదించారు. ‘భూటాన్‌ చాలా శుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశం. ఇలాంటి అవగాహన వీడియో రూపొందించినందుకు ధన్యవాదాలు. కొందరిలోనైనా ఈ వీడియో మార్పు తెస్తుంది. మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు