తమిళంలో వినూత్న యత్నం

31 Oct, 2014 23:29 IST|Sakshi
తమిళంలో వినూత్న యత్నం

 తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్. ఇటీవల తెలుగులో పెద్దగా కనిపించని ఈ నటుడు తమిళంలోనూ సరైన హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చారిత్రక నేపథ్యంలోని కాల్పనిక కథతో తమిళంలో రూపొందుతోన్న ‘కావ్య తలైవన్’ (కావ్య నాయకుడు అని అర్థం)పై ఆయన ఆశలు పెట్టుకున్నారు. 20వ శతాబ్దపు తొలినాళ్ళలో మదురై లాంటి ప్రాంతంలో ఊరూరూ తిరుగుతూ, నాటకాలు ప్రదర్శించే ఒక చిన్న రంగస్థల సమాజం నేపథ్యంలోని కథ ఇది. అందులోని ఇద్దరు నటుల మధ్య నెలకొనే పోటాపోటీ చిత్ర ప్రధానాంశం. అలా పోటీపడే రంగస్థల నటులుగా సిద్ధార్థ్, మలయాళ హీరో పృథ్వీరాజ్ కనిపిస్తారు.
 
 నాయిక పాత్రను వేదిక పోషిస్తున్నారు. ఒకప్పటి ప్రముఖ రంగస్థల నటి, గాయని, సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్న తార కె.బి. సుందరాంబాళ్ (‘అవ్వయ్యార్’ చిత్రం ఫేమ్) ప్రేరణతో ఆ కథానాయిక పాత్ర తీర్చిదిద్దారని కోడంబాకం కబురు. విభిన్నమైన చిత్రాల నిర్దేశకుడిగా పేరున్న వసంత బాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ సంగీతం అందిస్తున్నారు. 1920ల నాటి రంగస్థల సంగీతానికి తగ్గట్లుగా బాణీలు కట్టి, రీరికార్డింగ్ చేయడం కోసం రహమాన్ దాదాపు ఆరు నెలలు పరిశోధన చేశారట. రెండేళ్ళ పైగా సాగిన ఈ భారీ ప్రయత్నానికి తగ్గట్లే ఇప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. ‘‘ఊరూరా తిరుగుతూ, తమ నాటకంలోని ఒక ఘట్టాన్ని రోడ్డు మీదే ప్రదర్శించి, ఆకట్టుకొనే అప్పటి రంగస్థల కళాకారుల జీవితంపై సినిమా ఇది. అందుకే, మా చిత్ర బృందం కూడా తమిళనాడులోని ప్రధాన పట్టణాలన్నీ తిరుగుతూ, రకరకాల కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకర్షించనున్నాం’’ అని దర్శకుడు వసంత బాలన్ చెప్పారు. నవంబర్ 14న తమిళనాట విడుదల కానుంది.