‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి...’ అంటోన్న సిద్ధార్థ్!

9 Mar, 2019 15:39 IST|Sakshi

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సిద్ధార్థ్. కేవలం నటుడిగానే కాదు గాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. బొమ్మరిల్లు, ఓయ్, ఆట సినిమాల్లో పాటలు పాడిన సిద్ధార్థ్ చాలా కాలం తరువాత మరో తెలుగు పాట పాడారు. అయితే గతంలో తన సినిమాల్లో మాత్రమే పాటలు పాడిన ఈ హీరో ఇప్పుడు మరో హీరో కోసం గాయకుడిగా మారాడు.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్,  వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి ...’ను సిద్ధార్థ్ పాడారు. ఇటీవల సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు.

ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘తెలుగులో పాట పాడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలోని మధురమైన భాషల్లో తెలుగు ఒకటి. సంగీతంలో తెలుగు భాష మరింత తీయగా ఉంటుంది. న‌టుడిగా నాకు గుర్తింపు, గౌర‌వం, స్టార్‌డమ్‌నీ ఇచ్చింది తెలుగు సినిమాయే. తెలుగు ప‌రిశ్రమ‌ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగును నేనెప్పుడూ మరచిపోను. నేను ఈ పాట పాడటానికి ఒక్కటే కారణం. నాకు సందీప్ కిషన్ అంటే చాలా ఇష్టం. వ్యక్తిగా... నటుడిగా. తను నాకు తమ్ముడి లాంటి వాడు. తను ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేస్తున్నాడు. నిర్మాతగా తన తొలి సినిమాలో నన్ను పాడమని అడిగాడు. తన కోసం నేను పాట పాడాను’ అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘నాకు సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టం. హీరోగా నా తొలి రోజుల్లో చాలా సపోర్ట్ చేశాడు. నేను ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్న సినిమాలో తను ఏదో రకంగా అసోసియేట్ అయితే బావుంటుందని అనిపించింది. అలాగే, సిద్ధార్థ్ వాయిస్‌కి, ‘అప్పుడో ఇప్పుడో..’ పాటకు, ‘176 బీచ్ హౌస్ లో’ పాటకు నేను పెద్ద అభిమానిని. నిర్మాతగా నా మొదటి సినిమాలో సిద్ధార్థ్ గొంతులో నా పాట రావడం అనేది చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఇదొక ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్.నటుడిగా నాకు మొదటి నుంచి ఎవరెవరు అయితే అండగా నిలిచారో.. వారందరూ ఏదో రకంగా చిన్న భాగంగా అయినా ఉండాలని కోరుకున్నాను. అది ఇలా అయినందుకు సంతోషంగా ఉంది’ అన్నారు.

సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ ‘సిద్ధార్థ్ హీరోగా నటించి, నిర్మించిన తొలి సినిమా ‘లవ్ ఫెయిల్యూర్’కి... సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మాతగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి నేను సంగీత దర్శకుడు కావడం యాదృచ్చికమే. నాకు ఇది సంతోషంగా ఉంది. ఇద్దరూ నాకు మంచి స్నేహితులు’ అన్నారు. పాట రచయిత సామ్రాట్ మాట్లాడుతూ ‘ఈ లిరిక్స్ రాసేటప్పుడు ఈ పాట సిద్ధార్థ్ గారు పాడితే ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తూ, ఆయన్ను మనసులో పెట్టుకుని రాశాను. ఏయే తెలుగు పదాలు ఆయన వాయిస్ లో బావుంటాయని ఆలోచించి రాశా. ఇప్పటివరకూ సిద్ధార్థ్ పాడిన ప్రతి తెలుగు పాట బ్లాక్ బస్టర్. ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా’ అన్నారు.

మరిన్ని వార్తలు