నా తప్పూ ఉంది!

8 Dec, 2017 07:37 IST|Sakshi

తమిళసినిమా: నా తప్పు లేదని అనడం లేదు. ఉంది అయితే..అని వ్యాఖ్యానించారు సంచలన నటుడు శింబు. ఆయనపై నిర్మాత మైఖెల్‌రాయప్పన్‌ అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రానికి నష్టపోయిన రూ.20 కోట్లు చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఆ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శింబుపై రెడ్‌ కార్డ్‌ వేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు సంతానం హీరోగా నటించిన చక్క పోడు పోడు రాజా చిత్రాన్ని నటుడు వీటీవీ, గణేశన్‌ నిర్మించారు. సేతురామన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా నటుడు శింబు సంగీత దర్శకుడగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక ట్రిబుల్‌కేన్‌లోని కలవానర్‌ ఆవరణలో జరిగింది. ఆ కార్యక్రమంలో నటుడు ధనుష్‌ ఆడియోను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తానిక్కడికి శింబు ఆహ్వానం మేరకే వచ్చానన్నారు. తామిద్దరి మధ్య స్నేహమే ఉందన, కొందరు అనుకుంటున్నట్లు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న వాళ్లకే సమస్యలు ఉన్నాయని, వాళ్లే తమ మధ్య సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. శింబు ఆయన అభిమానులకోసం ఏడాదికి రెండు చిత్రాలైనా చేయాలని, ఆయన అభిమానుల తరఫున తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

మణిరత్నం నా అభిమానేమో
అనంతరం నటుడు శింబు మాట్లాడుతూ తన మిత్రుడు సంతానం కోరిక మేరకే ఈ చిత్రానికి సంగీతాన్ని అందించానన్నారు.అతని ఎదుగుదలకు తానెప్పుడూ పక్కాబలంగా ఉంటానని అన్నారు. ఇటీవల తన గురించి చాలా చర్చ జరిగిందని, అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రం నిర్మాత తనపై ఆరోపణలు చేశారని అన్నారు. తాను తప్పు చేయలేదని చెప్పడం లేదని, అయితే ఆయన చిత్ర షూటింగ్‌ సమయంలోనో, విడుదలకు ముందో, ఆ తరువాతో ఈ ఆరోపణలు చేస్తే సమంజసంగా ఉండేదని, చిత్రం విడుదలైన ఆరు నెలలకు ఎవరో చెబితే రచ్చ చేయడం ఏమిటని ప్రశ్నించారు.తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని అన్నారు. ఇకపోతే తానిప్పుడు మణిరత్నం చిత్రంలో నటించనున్నానని, ఆయన కూడా తన అభిమానో ఏమోగానీ, ఆ చిత్రం నుంచి తనను తొలగించలేదని తెలిపారు.ఈ నెల 20 నుంచి చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు మణిరత్నం చెప్పారని శింబు తెలిపారు.

మరిన్ని వార్తలు