చిన్మయి వర్సెస్‌ రాధా రవి

1 Feb, 2020 04:38 IST|Sakshi
చిన్మయి, రాధారవి

‘మీటూ’ ఉద్యమం మన దేశంలోనూ ఊపందుకున్నప్పుడు సౌత్‌ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపించిన పేరు చిన్మయి. గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చిన్మయి  పాపులర్‌. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచారు. ధైర్యంగా నిలబడ్డారు.  ‘మీటూ’ ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టారు.

తమిళ పరిశ్రమలో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన ట్వీటర్‌ వేదికగా వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు షేర్‌ చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్‌ యూనియన్‌ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షికరుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్‌ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ పదవిలో రాధారవి ఉన్నారు.

సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్‌ ఆర్డర్‌ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్‌ యూనియన్‌ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్‌ కెరీర్‌ మందకొడిగా సాగుతోంది.  తాజాగా ఈ నెల డబ్బింగ్‌ యూనియన్‌ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది. మరోసారి ప్రెసిడెంట్‌ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్‌ పదవికి నామినేషన్‌ వేశారు చిన్మయి.

విశేషం ఏంటంటే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్‌ యూనియన్‌ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?’ అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించారు. ‘‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్‌లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ప్రస్తుతం చిన్మయి నామినేషన్‌ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి.  ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎలాంటి నాటకీయత చోటు చేసుకుంటుంది? చిన్మయి వర్సెస్‌ రాధారవి.. గెలుపు ఎవరిది? అని తమిళ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

మరిన్ని వార్తలు