కరోనా: క‌నికాకు ఊరట

4 Apr, 2020 19:54 IST|Sakshi
క‌నికా క‌పూర్ (ఫైల్‌)

లక్నో: బాలీవుడ్ గాయ‌ని క‌నికా క‌పూర్‌కు ఊరట లభించింది. ఐదోసారి ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని ‘ఏఎన్‌ఐ’ శనివారం వెల్లడించింది. కోవిడ్‌-19 లేదని పరీక్షలో తేలినప్పటికీ ఆమెను వెంటనే డిశ్చార్జి చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు నిర్వహించే మరో పరీక్షలోనూ నెగెటివ్‌ వస్తేనే క‌నికా క‌పూర్ ఆస్పత్రి నుంచి బయటకు వస్తారు. ప్రస్తుతం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుప‌త్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వ్యైదులు తెలిపారు. అంతకుముందు నిర్వహించిన కరోనా నిర్ధారిత నాలుగు టెస్ట్‌ల్లోనూ పాజిటివ్‌ రావడంతో ఆందోళన వ్యక్తమయింది.

కాగా విదేశాల‌ నుంచి వ‌చ్చిన తర్వాత క‌నికా కపూర్‌ ప‌లు వేడుకల్లో పాల్గొన్నారు. రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తోపాటు సినీ సెల‌బ్రిటీలు హాజ‌ర‌వ‌గా తీవ్ర క‌ల‌క‌లం రేగింది. క‌నికాకు క‌రోనా సోకింద‌ని నిర్ధార‌ణ కాగానే ఆమెకు స‌న్నిహితంగా మెలిగిన వారంద‌రూ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. కనికా కపూర్‌కు కరోనా తగ్గిందని తెలియడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. భౌతిక దూరం పాటిస్తే కరోనాను సమర్థవంతంగా నిరోధించవచ్చని దీంతో మరోసారి రుజువయింది. (కరోనాపై గెలిచి.. సగర్వంగా ఇంటికి..)

మరిన్ని వార్తలు