ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌

11 Nov, 2019 16:45 IST|Sakshi

సాక్షి,ముంబై : ప్రఖ్యాత బాలీవుడ్‌ గాయని లతా మంగేష్కర్‌  (90) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస ఇబ్బందిగా ఉందని చెప్పడంతో (నవంబర్ 11) సోమవారం తెల్లవారుఝామున లతాజీని ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఎడమ వెంట్రిక్యులర్‌  ఫెయిల్యూర్‌తోపాటు, న్యుమోనియో కూడా ఎటాక్‌ కావడంతో  ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి  నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 

కాగా  లతా మంగేష్కర్‌  సెప్టెంబర్ 28 న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆమెకు పుట్టినరోజు కానుకగా భారత ప్రభుత్వం ‘డాటర్‌ ఆఫ్‌ ది నేషన్‌’ బిరుదును కేంద్రం అందించింది. వీటితోపాటు పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు. బాలీవుడ్‌కు 1000కి పైగా  చిత్రాల్లో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన లతా మంగేష్కర్‌కు తెలుగులో కూడా సంతానం సినిమాలో  ‘నిద్దుర పోరా తమ్ముడా ’ అనే పాటను పాడారు. ఆమె చేసిన విశేష సేవలకు గాను దేశంలోని అత్యున్నత  పురస్కారం భారత్ రత్న అవార్డును అందుకున్నారు. 

మరోవైపు అశుతోష్ గోవారికర్ చిత్రం ‘ పానిపట్’ లో గోపికా బాయిగా నటించిన తన మేనకోడలు పద్మిని కోహ్లాపురి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిన్న (నవంబరు 10) లతా  ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా పద్మినితోపాటు, చిత్ర యూనిట్‌కు ఆమె శుభాకాంక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు