‘ప్రేమా గీమా జాన్‌తా నయ్’

16 Aug, 2013 00:39 IST|Sakshi
‘ప్రేమా గీమా జాన్‌తా నయ్’
 ప్రేమంటే ఆ కుర్రాడికి అసహ్యం. అందుకే అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు. అలాంటి యువకుడు ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనే కథాంశంతో  రూపొందుతున్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్‌తా నయ్’. 
 
 ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర హీరోగా ఆర్వీ సుబ్బు దర్శకత్వంలో శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ పాట మినహా ఈ చిత్రం పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మిగిలిన పాటలను త్వరలో వైజాగ్‌లో చిత్రీకరించనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. 
 
 సెప్టెంబర్ రెండో వారంలో పాటలను విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇందులోని ప్రేమ సన్నివేశాలు సరికొత్తగా ఉంటుంది. వినోద ప్రధానంగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేందర్‌రెడ్డి-జగదీష్, ఆర్ట్: కె.వి. రమణ.