అమ్మా పెళ్లెప్పుడు? అని అడిగాడు!

21 Jul, 2018 00:11 IST|Sakshi

‘‘నేను మళ్లీ వార్తల్లోకొచ్చాను. నిన్ననే నా పెళ్లి ఫిక్స్‌ చేసేసింది సోషల్‌ మీడియా. చాలా రోజుల తర్వాత నా ఫోను మెసేజ్‌లతో నిండిపోయింది. చాలా సంతోషకరమైన విషయమే కానీ అది నిజం కాదు. అటువంటిది ఏమన్నా ఉంటే నేనే మీకు ముందుగా తెలియచేస్తాను’’ అంటున్నారు తెలుగులో పాపులర్‌ సింగర్‌గా పేరు తెచ్చుకున్న సునీత. ఇంతకీ విషయం ఏంటి? ఏమీ లేదండీ. నిన్న అంతా సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌గా మారింది. అదేంటంటే కొన్ని వెబ్‌ సైట్లలో ఈ మధ్య పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయ్‌  మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతోంది కదా.. అలాగే సింగర్‌ సునీత కూడా రెండో పెళ్లి చేసుకుంటుంది అనే వార్త పాప్‌ అప్‌ అయింది. అవునా.. ఆ వరుడు ఎవరో కనుక్కుందామని సునీతకు ఫోన్‌ చేస్తే ఓ నవ్వు నవ్వారామె. ‘‘సోషల్‌ మీడియా తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఏ పేరని చెప్పను? ఏమని చెప్పను? ప్రస్తుతానికి అటువంటిది ఏమీ లేదు. నా వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. నేను ఈ మధ్యే చాలా కాలం ఫైట్‌ చేసి డివోర్స్‌ తీసుకున్నాను. అంతలోనే ఈ న్యూస్‌. అందరూ ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ అంటుంటే మొదట నాకేమి అర్థం కాలేదు. నాకు కంగ్రాట్స్‌ చెప్పిన వాళ్లనే విషయమేంటని అడిగితే ‘మీ పెళ్లంట కదా’ అన్నారు. 

నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్థం అయ్యింది. అదేంటంటే చాలామంది నేను మళ్లీ పెళ్లి చేసుకుని జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సునీత. ‘అన్నింటికంటే ఆనందమైన విషయమేంటంటే మా అమ్మ, నాన్న మాట్లాడుతూ.. ప్రపంచమంతా నీ గురించి ఇంతగా ఆలోచిస్తూ నీ మంచి కోరుతున్నారు నిజంగా మళ్లీ పెళ్లి చేసుకుని హ్యాప్పీ=గా ఉండొచ్చు కదా సునీత’ అన్నారు. కొసమెరుపు ఏంటంటే  మా అబ్బాయి ఆకాశ్‌  డిల్లీలో బి.టెక్‌ చదువుతున్నాడు. వాడు నిన్న నాకు ఫోన్‌ చేసి ‘అమ్మాల పెళ్లి డేటెప్పుడు? అని అడిగాడు. ‘నిజంగానే చేసుకో మమ్మీ’ అని వాడు మనస్పూర్తిగా కోరుకున్నాడు. అందరూ నా గురించి ఇంత పాజిటివ్‌గా అలోచిస్తుంటే ఇంతకంటే ఏమి కావాలి జీవితానికి అనిపిస్తుంది’’ అన్నారు సునీత. ఇంత ఆహ్లాదంగా అన్ని విషయాలు చెప్తూనే చిన్న చురక కూడా అంటించారామె. ‘‘ఎవరికైనా పర్సనల్‌ లైఫ్‌ ఉంటుంది. ఆ స్పేస్‌ను ఎవరైనా సరే వాళ్ల ఇష్టానికి వదిలేయ్యాలి’’ అని కూడా అన్నారు. ‘‘అటువంటిదేమన్నా ఉంటే ముందుగా నేనే మీడియాకు తెలియ చేస్తాను’’ అని చెప్పారు. ఏదేమైనా పెళ్లి వార్త నిజమా కాదా అనేది మాత్రం ఎక్కడ కమిట్‌ కాలేదు ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌.
- శివ మల్లాల 

మరిన్ని వార్తలు