సింగిల్‌  అంటే  ఒకరుకాదు

27 Jan, 2019 23:36 IST|Sakshi

సింగిల్‌ పేరెంట్‌ అంటే అమ్మా లేక నాన్న కాదు. అమ్మానాన్న రెండూ! ఇద్దరి ప్రేమనూ ఆ ఒక్కరే పంచాలి. రెండు బాధ్యతలు తీసుకోవాలి. సింగిల్‌ పేరెంట్‌ కావడానికి కారణాలు, వాటి నేపథ్యాలు వేరువేరుగా ఉండొచ్చు. కానీ నిలబడే తీరు ఒకటే.. స్థయిర్యంగా. ఛాలెంజెస్‌ను ఎదుర్కొనే ఆయుధమూ ఒకటే.. ఆత్మ విశ్వాసం! ‘‘భార్యాభర్తలు విడిపోవచ్చు.. కానీ అమ్మానాన్నా విడిపోకూడదు’’..‘భామనే సత్యభామనే’ అనే సినిమాలోని డైలాగ్‌. వినడానికి బాగుంది. ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది.

అమ్మానాన్న మానసికంగా విడిపోయాక కూడా వాళ్లు భార్యాభర్తలే. పిల్లల కోసం ఒకే చూరు కింద సర్దుకుపోయే భార్యాభర్తలు. కొన్ని జంటల విషయంలోనే విడాకులు తప్పనిసరవుతాయి. అమ్మా... నాన్న.. ఇద్దరిలో ఎవరో ఒకరు పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటే సింగిల్‌ పేరెంట్‌ ప్రయాణం కాస్త తేలిక కావచ్చు. లేకపోతే.. సామాజికపరమైన సవాల్‌ అదనం. ముఖ్యం గా ఆడవాళ్లకు. నైతిక స్థయిర్యం చాలా అవసరం. అలా సింగిల్‌ హ్యాండెడ్‌గా పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేసిన సింగిల్‌ పేరెంట్స్‌ సినిమా ఫీల్డ్‌లో చాలా మందే ఉన్నారు. ఎస్పెషల్లీ ఇన్‌ బాలీవుడ్‌. సినిమా కథకేమీ తీసిపోని జీవితాలు వాళ్లవి. వాళ్లెవరో చూద్దాం.

బబిత
బబిత... బాలీవుడ్‌ నటి. హిందీ సినిమా లెజెండ్‌ రాజ్‌కపూర్‌ పెద్ద కోడలు. నటుడు రణధీర్‌ కపూర్‌ భార్య. కరిష్మా, కరీనా కపూర్‌ల తల్లి. భార్యాభర్తలుగా బాగున్నారు. అమ్మానాన్న అయ్యాకే గొడవలు మొదలయ్యాయి. కరిష్మాను నటిని చేద్దాం అని బబిత తల్లిగా బిడ్డ పట్ల ఉన్న తన కోరిక చెప్పగానే తండ్రిగా రణధీర్‌ కపూర్‌ వద్దు అన్నాడు. ఈ స్పర్థ ఇంకా అనేక గొడవలకు దారితీసి.. ఎడతెగని వాగ్వివాదాలతో ఆ ఆలుమగలు విడిపోవడం అనివార్యం అయింది. కరిష్మా, కరీనాల బాధ్యత బబితే తీసుకుంది. ఒంటరి తల్లిగా ఆ ఇద్దరినీ పెంచి, పెద్దచేసి తాను నటీమణులుగా నిలబెట్టింది. 2007లో పిల్లలిద్దరూ తమ తల్లిదండ్రులను ఒకే కప్పు కిందకు తెచ్చారు. అమ్మానాన్నగా మాత్రమే కలిసి ఉంటున్నారంతే! 

అమృతాసింగ్‌
బాలీవుడ్‌ నటిగా అందరికీ తెలుసు. సైఫ్‌ అలీఖాన్‌ మాజీ భార్యగానూ అంతే పరిచయం. ఈ జంట పిల్లలే సారా అలీఖాన్, ఇబ్రహీం. సారా అలీఖాన్‌ కూడా ‘కేదార్‌నాథ్‌’ సినిమాతో ఈ మధ్యే బాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయింది. సారా, ఇబ్రహీంలకు లోకజ్ఞానం వచ్చేటప్పటికే వాళ్ల అమ్మానాన్నా విడిపోయారు. పిల్లలిద్దరినీ అమ్మ అమృతే పెంచింది. 

నీలిమా అజీమ్‌
నీలిమా కూడా నటే. కాని షహీద్‌ కపూర్‌కి అమ్మగానే ఎక్కువ మందికి పరిచయం. నటుడు పంకజ్‌ కపూర్, నీలిమాలది ప్రేమ వివాహం. షహీద్‌ కపూర్‌కి మూడేళ్లప్పుడు ఈ ఇద్దరూ విడిపోయారు. షహీద్‌ తల్లి దగ్గరే పెరిగాడు. తండ్రితోనూ షహీద్‌కు మంచి అనుబంధమే ఉంది. అదంతా నీలిమా పెంపకం గొప్పదనమే అంటారు బాలీవుడ్‌ ఫోక్స్‌. షహీద్‌ కపూర్‌ బాలీవుడ్‌ జర్నీ మొత్తం బాక్సాఫీస్‌ హిట్లుగానే సాగలేదు. అతని ఫెయిల్యూర్స్‌లో వెన్నంటి ఉంది నీలిమే. కొడుకు మానసిక స్థితిని అర్థం చేసుకుని అండగా నిలబడింది.

పూజా బేడీ
సంచలన నటి. సినిమాల కన్నా ఆమె నటించిన యాడ్స్‌తో ఎక్కువ పాపులర్‌ అయింది. నటుడు కబీర్‌ బేడీ – నర్తకి, మోడల్‌ ప్రతిమా బేడీల ముద్దుల కూతురు. పూజా వైవాహిక జీవితమూ కష్టాలమయమే. బజినెస్‌ టైకూన్‌ ఫర్హాన్‌ ఇబ్రహీమ్‌ను పెళ్లిచేసుకుంది. ఆలియా, ఒమర్‌ (కూతురు, కొడుకు) పుట్టాక  ఫర్హాన్‌ ఇబ్రహీమ్‌తో సాహచర్యం పూజకు కన్నీళ్లనే మిగిల్చింది. పిల్లలను తీసుకొని ఆ గడపదాటింది. ఒంటరి తల్లిగానే పిల్లల మంచిచెడుల బాధ్యతలను భుజాలకెత్తుకుంది. 

కోరుకున్న పేరెంటింగ్‌
కరిష్మా, కొంకణాసేన్‌లు కూడా సింగిల్‌ మదర్‌ జాబితాలో ఉన్నారు. వీళ్లు కాక.. బై చాయిస్‌ అంటే పెళ్లి, విడాకులతో సంబంధం లేకుండా కూడా సింగిల్‌ మదర్‌గా పిల్లలను పెంచుతున్న సెలబ్రిటీలు ఉన్నారు. రవీనా టాండన్‌.. అనిల్‌ థడానీతో పెళ్లికంటే ముందే పూజ, ఛాయ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ కూడా ఈ విషయంలో రవీనాను ఆదర్శంగా తీసుకున్నట్టుంది.
పాతికేళ్ల వయసులోనే ఆడపిల్లను దత్తత తీసుకుంది. ఆ తర్వాత 2010లో ఇంకో పాపనూ అడాప్ట్‌ చేసుకొని సింగిల్‌ మదర్‌గానే వాళ్లను పెంచుతోంది. నీనా గుప్తా.. థియేటర్‌ అండ్‌ బాలీవుడ్‌ నటి. వెస్ట్‌ ఇండీస్‌ క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌ను ఇష్టపడింది. పెళ్లిబంధం లేకుండానే మసాబాను కన్నది. అంతే ఇష్టంగా వివ్‌ రిచర్డ్స్‌ తోడు లేకుండానే మసాబాను పెంచి పెద్ద చేసింది. మసాబా... సెలెబ్రెటీ ఫ్యాషన్‌ డిజైనర్‌.

అపర్ణా సేన్‌
నటి, దర్శకురాలు అయిన అపర్ణాసేన్‌ ప్రముఖ బాలీవుడ్‌ నటి కొంకణా సేన్‌ వాళ్ల అమ్మ, ఫిల్మీ లైఫ్‌లో గ్రేట్‌ సక్సెస్‌ సాధించిన అపర్ణ వైవాహిక జీవితంలో చేదునే చవి చూసింది. కొంకణా సేన్‌కు ఆరేళ్లున్నప్పుడు అపర్ణ తన భర్త ముకుల్‌ శర్మతో విడిపోయింది. అప్పటికే ఆమె నటిగా, దర్శకురాలిగా కూడా బిజీ.. ఇటు హిందీ, అటు బెంగాలీ భాషల్లో. అయినా కూతురిని తనే పెంచుకుంది. జీవితం ఏం ఇచ్చినా తీసుకోవాలి అన్నది అపర్ణాసేన్‌ ఫిలాసఫీ. ఆ తత్వాన్నే కూతురికీ బోధించింది. ప్రాక్టికల్‌గా ఉండడం నేర్పింది.
అందుకే కొంకణా సేన్‌ చెప్తుంది.. ‘‘మొదట్లో అమ్మానాన్నా వేరువేరుగా ఉండడం మింగుడుపడలేదు. స్కూల్‌ ఫంక్షన్స్‌కి నా ఫ్రెండ్స్‌ పేరెంట్స్‌ కలిసి వచ్చి, మా అమ్మ మాత్రం ఒక్కతే వస్తుంటే నాకు దిగులుగా, బాధగా.. అనిపించేది. కానీ ఊహ తెలిసింతర్వాత.. మా ఇంటి పరిస్థితిని అమ్మ వివరిస్తుంటే.. అర్థమైంది. అందరి ఇళ్లు ఒకేరకంగా ఉండవని, అమ్మానాన్నలందరూ కలిసి ఉండరని. విడిపోవడం సాధారణ విషయమే అని, విడిపోయినా అమ్మా, నాన్న ఇద్దరూ పిల్లలకు ఉంటారు అని’’ అంటోంది.

మరిన్ని వార్తలు