సితార ముద్దు మాటలకు సమంత ఫిదా

28 Oct, 2016 18:25 IST|Sakshi
సితార ముద్దు మాటలకు సమంత ఫిదా
పులి కడుపున పులిపిల్లలే పుడతాయంటారు. టాలీవుడ్‌లో మహేష్ బాబుకు ఉన్న అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. అతడి డైలాగ్ డెలివరీ గానీ, హావభావాలు గానీ వెండితెర మీద చూస్తే అభిమానులు గోలగోల చేస్తుంటారు. ఇప్పటికే మహేష్ కొడుకు గౌతమ్ 1 సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు త్వరలో ఆయన ముద్దుల కూతురు సితార వంతు వచ్చేలా ఉంది. రెండు చిన్న చిన్న పిలకలు వేసుకుని క్యూట్‌గా ఉండే సితార అంటే మహేష్ అభిమానులతో పాటు టాలీవుడ్ హీరోయిన్ సమంతకు కూడా ఎక్కడలేని ఇష్టం. ఆమెతో ఆడుకుంటుంది, బొమ్మలు ఇస్తుంది.. అన్నీ చేస్తుంది. 
 
తాజాగా మహేష్ - సమంత నటించిన బ్రహ్మోత్సవం సినిమాలోని ఓ డైలాగును సితార కూడా ముద్దుముద్దగా పలికింది. ఆ విషయాన్ని మహేష్ అభిమాని ఒకరు ట్వీట్ చేయగా.. తామిద్దరిలో పోటీ అన్నది లేనే లేదని, సితారే గెలిచిందని చెప్పింది. ఇంతకీ ఆ డైలాగు ఏంటో తెలుసా.. ''ఏడు తరాలా.. వెతికితే దొరకనంత మందా.. కలిస్తే వదులులేకోనంత మందా''. వీడియోలో తొలుత సమంత ఆ డైలాగు చెప్పగా.. ఆ తర్వాత సితార కూడా తన ముద్దుముద్దు మాటలతో అదే డైలాగును రిపీట్ చేస్తుంది. సితార ఆ డైలాగు చెప్పిన తీరుకు సమంతతో పాటు మహేష్ అభిమానులు కూడా ఫిదా అయిపోయారు.