‘బిగ్‌బాస్‌’ శివ బాలాజీ

25 Sep, 2017 12:40 IST|Sakshi

3.37 కోట్ల ఓట్లతో వరించిన విజయం

రన్నరప్‌గా ఆదర్శ్‌

విజేతకు రూ.50 లక్షల నగదు బహుమతి అందజేసిన ఎన్టీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌’ విన్నర్‌ ఎవరు? లక్షల నగదు బహుమతిని దక్కించుకునే ఆ విజేత ఎవరు? ఈ ఉత్కంఠకు ఎట్టకేలకు ఆదివారం తెరపడింది. 3.37 కోట్ల ఓట్లతో శివబాలాజీ విజేతగా నిలిచారు. ఆదర్శ్‌ రన్నరప్‌ నిలిచారు. విన్నర్, రన్నరప్‌ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎనిమిదిన్నర లక్షలే. బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆదివారం రాత్రి శివబాలాజీకి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్‌ బాస్‌’ ట్రోఫీని అందజేశారు. మాటీవీలో 70 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగిన సంగతి తెలిసిందే. చివరికి హౌస్‌లో నవదీప్, శివ బాలాజీ, ఆదర్శ్‌ బాలకృష్ణ, అర్చన, హరితేజ మిగిలగా, శివ బాలాజీని విజయం వరించింది.

ఫైనల్‌కి చేరిన ఐదుగురు కంటెస్టంట్లలో అర్చన 5, నవదీప్ 4, హరితేజ3, ఆదర్శ్ 2 స్థానాల్లో నిలిచారు. గత వారం అక్షరాలా పదకొండు కోట్లకు పై చిలుకు మంది ఆడియన్స్‌ తమ అభిమాన సెలబ్రిటీని గెలిపించేందుకు ఓటింగ్‌లో పాల్గొన్నారు. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో శివ బాలాజీ బిగ్‌బాస్ సీజన్-1 టైటిల్‌తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. విన్నర్‌ను ప్రకటించిన వెంటనే శివ బాలాజీ కుటుంబసభ్యుల దగ్గరికి చేరి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం విజేతకు ట్రోఫీ, క్యాష్‌ ప్రైజ్‌లను వ్యాఖ్యాత ఎన్టీఆర్‌ అందజేశారు. 71రోజులు.. 60 కెమెరాల మధ్య.. 16 మంది (ఇద్దరు వైల్డ్ కార్డ్) కంటెస్టెంట్స్‌తో జూలై 16వ తేదీన షో ప్రారంభమైంది. కంటెస్టంట్ల ప్రదర్శనలతో 71 రోజుల పాటు షో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌ విన్నర్‌ని అనౌన్స్ చేయడంతో బిగ్‌బాస్ సీజన్-1‌కి శుభం కార్డు పడింది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు వారాలబ్బాయి అని వినేవాణ్ణి. ఇప్పుడు వారం వారం వచ్చి మీతో (ప్రేక్షకులు), ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌మేట్స్‌తో ప్రేమను పంచుకున్నాను. ఇది నాకు మంచి ఎమోషనల్‌ జర్నీ. ఆ దేవుడు ఎవర్ని ఎప్పుడు, ఎక్కడ కలుపుతాడో తెలియదు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు నాపై చూపించిన అభిమానానికి మాటలు రావడంలేదు. అనంతరం విన్నర్‌ శివబాలాజీ మాట్లాడుతూ ‘‘విన్నర్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. మధ్యలో ఎలిమినేట్‌ అయిపోతా నేమో అనుకున్నప్పటికీ చివరి వరకూ ఉంటాననే నమ్మకం కూడా ఉండేది. ఏదైనా కావాలని బలంగా కోరుకుంటే అది నెరవేరుతుందన్నది నా నమ్మకం. నా హౌస్‌మేట్స్‌ నాకు బాగా సహకరించారు’’ అని అన్నారు.

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న తొలి షో బిగ్‌ బాసే. షో ప్రారంభం నుంచే ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రతి వారాంతంలో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో పెద్ద ఎత్తున టీఆర్పీ రేట్లు నమోదయ్యాయి. ఈ ఆదివారం జరిగిన చివరి ఎపిసోడ్‌ను నిర్వాహకులు ప్రత్యేకంగా నిర్వహించారు. షోలో పాల్గొన్న కంటెస్టంట్లందరిని కార్యక్రమానికి ఆహ్వానించారు. అంతేకాదు స్టేజ్‌పై బిగ్‌బాస్‌ను అనుకరిస్తూ బిగ్‌బాస్‌ స్కిట్‌కూడా చేశారు. కార్యక్రమం ప్రసారం దాదాపు 5.30 గంటలకు పైగా ప్రసారం అయింది. అంతేకాదు చివరి రోజు ఎన్టీఆర్‌తో కలిసి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ బిగ్‌బాస్‌ స్టేజ్‌పై పాటలు, డాన్స్‌తో అలరించారు. బిగ్‌బాస్‌లోని కంటెస్టంట్లందరికి ఫన్నీఅవార్డులను కూడా ప్రకటించారు.

ఫన్నీ అవార్డ్స్:
ఉచిత సలహా అవార్డు (మహేష్ కత్తి)
అయోమయం అవార్డు (సంపూర్ణేష్ బాబు)
గ్రైన్డర్ అవార్డ్ (దీక్ష)
రోమియో అవార్డు (ప్రిన్స్)
బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు (ధనరాజ్)
గురకరాయుడు అవార్డు (సమీర్)
ఫిటింగ్ మాస్టర్ అవార్డు (కత్తి కార్తీక)
గుండెల్లో గోదారి అవార్డు (మధుప్రియ)

మరిన్ని వార్తలు