గ్లామర్ అంటే బికినీయేనా ?

9 Nov, 2013 23:59 IST|Sakshi
కథానాయికల కెరీర్ పాతిక, ముప్ఫయ్ ఏళ్లనే మాట నాటి తరం నాయికలతోనే పోయింది. నేటి తరం నాయికలు మహా అయితే ఆరేడేళ్లు రాణించగలుగుతారేమో? చాలామంది విషయంలో ఇదే జరుగుతుంది. కానీ, నయనతారలాంటివారి విషయంలో మాత్రం అబద్ధం అవుతుంది. ఆమె కథానాయికై పదేళ్లయ్యింది. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటారామె. భాష కాని భాషలో సినిమాలు చేస్తూ పదేళ్లు నెగ్గుకొచ్చారు కదా. మీ విజయ రహస్యమేంటి? అనే ప్రశ్న నయనతార ముందుంచితే -‘‘అంకితభావం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం... ఈ మూడింటితో పాటు ఆ దేవుడి ఆశీర్వాదం. పదేళ్లుగా ఇక్కడ ఉంటూ...
 
  ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నానంటే ఇవే కారణాలు. ప్రతిభకు అదృష్టం తోడైతే ఎవరైనాసరే సక్సెస్ ట్రాక్‌లో వెళ్లిపోతారు’’ అని చెప్పారామె. కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా అడపాదడపా తనని తాను మరింతగా నిరూపించుకునే పాత్రలు చేస్తూ వస్తున్నారు నయనతార. ‘గ్లామర్’కి సరైన అర్థం చాలామందికి తెలియదని ఆమె చెబుతూ -‘‘గ్లామర్ అంటే స్కిన్ షో అని కొంతమంది అనుకుంటారు. అలాగే బికినీ ధరిస్తేనే గ్లామర్ అంటారు. కానీ, లంగా, ఓణీ, చీరల్లో కూడా గ్లామరస్‌గా కనిపించవచ్చు. మనం మన శరీరాన్ని ఎంత స్టయిలిష్‌గా ప్రదర్శిస్తున్నామన్నదే ముఖ్యం. నా దృష్టిలో గ్లామర్ అంటే స్టయిలిష్‌గా కనిపించడం. అంతేకానీ వేసుకునే కాస్ట్యూమ్‌ని బట్టి గ్లామర్ వచ్చేయదు’’ అన్నారు.