బొమ్మలాట

7 Feb, 2018 00:31 IST|Sakshi
వాయిదా పడుతున్న సినిమాలు

సినిమా అంటే బొమ్మ.
బొమ్మ ఎప్పుడు థియేటర్‌లో పడుతుందా అని ఎదురు చూస్తారు.
అయితే ఎదురు చూసే బొమ్మ ఒకటి.. వచ్చే బొమ్మ ఇంకోటి!
ఒకరి బొమ్మ వస్తుందని ఇంకొకరు 
ఈ మధ్య తమ బొమ్మలను వాయిదా వేస్తున్నారు.
ఈ బొమ్మలాట  కుర్చీలాటలా మారింది.
ఒకరు కూర్చునే లోపు ఇంకొకరు...
మ్యూజికల్‌ చైర్‌లో కుర్చీ కోసం పరిగెడతారు.
కుర్చీలో కూర్చునే బొమ్మ ఏదో తెర మీద పడేవరకూ కన్‌ఫ్యూజనే.
ఈ  బొమ్మలాట కహానీపై ఓ కన్నేద్దాం.

జనవరి 26... దేశ ప్రజలందరూ పండగ చేసుకునే రోజు. ఈసారి సినిమా లవర్స్‌కీ పండగ రోజే. ఎందుకంటే రిపబ్లిక్‌ డే సరిగ్గా శుక్రవారం వచ్చింది. సెలవు రోజు. కొత్త బొమ్మ పడుతుంది. థియేటర్‌ నిండుతుంది. క్యాష్‌ చేసుకోవడానికి ఇది సరైన టైమ్‌. అయితే ఇదే రోజు రిలీజ్‌ కావాల్సిన కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘మనసుకు నచ్చింది’ సినిమాలు వాయిదా పడ్డాయి. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్‌ జంటగా రూపొందిన చిత్రం ‘ఆచారి ఆమెరికా యాత్ర’. కృష్ణమాచారి (మంచు విష్ణు) తప్పులు, అప్పలాచారి తిప్పలతో సాగే ఈ నవ్వుల యాత్రను జనవరి 26న చూపిద్దామనుకు న్నారు. అయితే యాత్రను పోస్ట్‌పోన్‌ చేసి,  తర్వాత చూపించాలనుకుంటున్నారు. ఇక, ‘మనసుకు నచ్చింది’ విషయానికొస్తే.. సూపర్‌ స్టార్‌ కృష్ణ కుమార్తె దర్శకత్వం వహించిన ఫస్ట్‌ మూవీ ఇది. పెళ్లికూతురో లేదా పెళ్లి కొడుకో పెళ్లి టైమ్‌కి పారిపోవడం వింటుంటాం. అలాంటిది పెళ్లికొడుకే పెళ్లికూతుర్ని లేపుకుపోతే కాస్త డిఫరెంట్‌ కదా! ఈ కాన్సెప్ట్‌తోనే ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టాలని డిసైడయ్యారు మంజుల. సందీప్‌ కిషన్, అమైరా దస్తూర్‌ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని గత నెల 26న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఫిబ్రవరి 16కి వాయిదా వేశారు. ఈ రెండు సినిమాలూ ఎందుకు వాయిదా పడ్డాయి? అంటే ప్రధానంగా చెబుతున్న కారణం ‘భాగమతి’, హిందీ ‘పద్మావత్‌’. ఈ రెండు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయ్యాయి. మరోవైపు ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘మనసుకు నచ్చింది’ కూడా ఆల్రెడీ పోస్టర్లు, టీజర్‌ల ద్వారా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలైతే కలెక్షన్స్‌ డివైడ్‌ అవ్వడంతో పాటు, థియేటర్లు తక్కువగా దొరుకుతాయి. అందుకే ఈ రెండు సినిమాలూ వాయిదా పడ్డాయి.

చెన్నై పోలామ్‌ వాంగ
అటు చెన్నై పోలామ్‌ (వెళదాం) వాంగ (రండి). జనవరి 26న విడుదల కావాల్సిన విశాల్‌ ‘ఇరంబుదురై’ వరలే (రాలేదు). ఆడ విడుదల కావాల్సిన ‘ఇరుంబుదురై’ ఈడ ‘అభిమన్యుడు’గా రిపబ్లిక్‌డేకి రావాల్సింది. కానీ రాలేదు. మరి.. ఎప్పుడు ఆగుమ్‌ (అవుతుంది) అనేది ఇంకా చిత్రబృందం ప్రకటించలేదు. ఇంకో సినిమా ‘జయం’ రవి నటించిన ‘టిక్‌. టిక్‌. టిక్‌’. ఇండియన్‌ స్క్రీన్‌పై ప్రేక్షకులు చూడబోతున్న ఫస్ట్‌ స్పేస్‌ మూవీ ఇది. ముందు అనుకున్నట్లుగా విడుదల చేసి ఉంటే జనవరి 26న తమిళ ప్రేక్షకులు చూసేవాళ్లు. అయితే వాయిదా పడింది. రిలీజ్‌ చేసేద్దామనుకుని ప్రమోషన్‌ కూడా భారీగా చేశారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ చేయలేదు. న్యూ రిలీజ్‌ డేట్‌ను ఇంకా ఎనౌన్స్‌ చేయలేదు. ఇలాగే మమ్ముట్టీ మలయాళ సినిమా ‘స్ట్రీట్‌లైట్స్‌’ విషయంలోనూ జరిగింది. జనవరి 26న రిలీజ్‌ చేయాలనుకున్న ఈ సినిమా వాయిదా పడి, ఈ నెల 2న రిలీజైంది.

సీన్‌ రిపీటైంది!
ఒకేరోజు రెండుకి మించి సినిమాలు విడుదలైతే వసూళ్లు డివైడ్‌ అవుతాయి కాబట్టి, జనవరి 26కి విడుదల కావాల్సిన రెండు మూడు సినిమాలు వెనక్కి తగ్గాయి. సేమ్‌ సీన్‌ ఫిబ్రవరి 9న కూడా రిపీట్‌ అయ్యింది. మోహన్‌బాబు ‘గాయత్రి’, వరుణ్‌ తేజ్‌ ‘తొలిప్రేమ’, నిఖిల్‌ ‘కిరాక్‌ పార్టీ’, సాయిధరమ్‌ తేజ్‌ ‘ఇంటిలిజెంట్‌’, నాగశౌర్య ‘కణం’ సినిమాల రిలీజ్‌ డేట్‌ను ముందుగా ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఒకే రోజు ఐదు సినిమాల రిలీజ్‌ అయితే లెక్కల్లో తేడాలు వస్తాయి. కనీసం రెండు సినిమాలన్నా వాయిదా పడతాయనుకున్నారు. అనుకున్నట్లే ‘కణం’ సినిమా ఫిబ్రవరి 23కు వాయిదా పడింది. అనుకున్నట్లుగానే ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్‌’ 9కి వస్తున్నాయి. ‘తొలిప్రేమ’ ఒక్క రోజు వాయిదా పడి ఫిబ్రవరి 10న రిలీజ్‌ కానుంది. ‘కిరాక్‌ పార్టీ’ చేసుకోవడానికి ఇంకాస్త టైముంది. త్వరలో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తామని చిత్రనిర్మాతల్లో ఒకరైన అనిల్‌ సుంకర పేర్కొన్నారు. 

వార్‌ వేడి తగ్గేలా లేదు!
ఏప్రిల్‌ వార్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ సినిమాతో ఏప్రిల్‌ వార్‌కి నాని సై అంటున్నారు. నితిన్‌ కూడా తన సినిమాను ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయనున్నాడు. ఆల్రెడీ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో నాగార్జున, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో మహేశ్‌ బాబు, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంటూ అల్లు అర్జున్‌ ఏప్రిల్‌ వార్‌కి కర్చీఫ్‌ వేశారు. యాక్చువల్లీ సినిమాల రిలీజ్‌కి బెస్ట్‌ సీజన్స్‌లో ఏప్రిల్‌ ఒకటి. సెలవులను క్యాష్‌ చేసుకోవచ్చు. ఎన్ని సినిమాలు విడుదలైనా ఫర్వాలేదు. అయితే ఒకేరోజు ఎక్కువ సినిమాలు రిలీజైతే కలెక్షన్స్‌ డివైడ్‌ అవుతాయి. మరి.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా తమ సినిమాను వాయిదా వేసుకుంటారా? చూడాలి. 

చిట్టికి ఫ్రీడమ్‌ ఆ రోజేనా?
గతేడాది దీపావళికి రిలీజ్‌ అన్నారు. థియేటర్‌లో బొమ్మపడలేదు. మళ్లీ జనవరి 25 అని మనసు మార్చుకున్నారు. ఇదంతా ‘2.0’ సినిమా రిలీజ్‌ గురించే. శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్యతారలుగా రూపొందిన సినిమా ‘2.0’. ఆల్మోస్ట్‌ 400 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందింది. జనవరిలో చిట్టి మిస్సయ్యాడు. ఏప్రిల్‌లో చూపిస్తామని  చిత్రబృందం ఎనౌన్స్‌ చేసింది. ఇప్పుడు సమ్మర్‌కి కూడా రోబో సందడి లేదట. సినిమా వచ్చేది ఆగస్టు 15నే అని ట్రేడ్‌ విశ్లేషకులు తాజాగా మంగళవారం న్యూ డేట్‌ని తెర మీదకు తీసుకొచ్చారు. అదే నిజమైతే అప్పుడు అక్షయ్‌కుమార్‌ ‘గోల్డ్‌’ ఇరుకుల్లో పడ్డట్లే. అక్షయ్‌ కుమార్‌ నటించిన ఈ సినిమా ఆగస్ట్‌ 15కి రావాలి. మరి.. చిట్టికి ఫ్రీడమ్‌ ఆ రోజేనా? అంటే... థియేటర్‌లోకి వచ్చేది ఆ రోజేనా? మరి.. చిట్టి అదే రోజున వస్తే.. హిందీలోనూ బొమ్మ పడుతుంది  కాబట్టి.. ‘గోల్డ్‌’ డేట్‌ మారుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

సౌత్‌లో థియేటర్స్‌క్లోజ్‌!
రిలీజ్‌ కావడానికి ఇన్ని సినిమాలు పోటీ పడుతుంటే మార్చి 1నుంచి థియేటర్స్‌ మూతపడనున్నాయన్న వార్తలు వస్తున్నాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ల ఛార్జీల వైఖరికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి  అభ్యంతరం తెలిపింది. ముందుగా సూచించిన సమయానికి కల్లా డిజిల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు చర్చలకు రాకపోతే మార్చి1 నుంచి రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ను మూసివేయాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి.కిరణ్‌ తెలిపారు. ఇది మాత్రమే కాదు.. తమిళ, మలయాళం, కన్నడ పరిశ్రమల్లో కూడా ఇదే పరిస్థితి. ఒకవేళ ఈ ఇష్యూ ఒక కొలిక్కి రాక.. సౌత్‌లో థియేటర్స్‌ షట్‌ డౌన్‌ అయితే అసలుకే ఎసరు వస్తుందేమో!

బాలీవుడ్‌ సినిమాలూ కుర్చీలాట ఆడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడి ‘పద్మావత్‌’ తెరకొచ్చింది. ‘బజార్‌’, ‘సూర్మ’, ‘సోనూ కే టిట్టు కీ స్వీటీ’ వంటి సినిమాలూ వాయిదా పడ్డాయి. పోస్ట్‌పోన్ అయిన మరికొన్ని సినిమాలు..  


-  ముసిమి శివాంజనేయులు

మరిన్ని వార్తలు