అబ్బో.. ఎంత రేటో!

11 Mar, 2016 03:07 IST|Sakshi
అబ్బో.. ఎంత రేటో!

వెండి తెరపై జిగేల్ మనే అందాలతో మైమరపించే ప్రముఖ నటీమణుల తాజా పారితోషికాల వివరాలను చూస్తే ఎవరికైనా కచ్చితంగా అబ్బా అనిపించక మానదు.ఇంతకు ముందు చిత్రపరిశ్రమలో హీరోల ఆధిక్యం కొనసాగేది. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు ప్రత్యక్షంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.హీరోలు ఆధిక్యం వారి పారితోషికం విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తుండేది. అలాంటిదిప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యిందని అనలేము గానీ, మార్పు వచ్చిందని మాత్రం చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు అధికంగా హీరోల చుట్టూనూ కథలు తిరుగుతుండేవి. అందుకే వారు అధిక పారితోషికం డిమాండ్ చేస్తుండేవారు.తాజాగా కథల విషయంలోనే మార్పు వచ్చిందని చెప్పక తప్పదు.హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్న పరిస్థితి అధికమైందనే చెప్పాలి.ఆ తరహా కథా చిత్రాలు విజయం సాధించి,ముఖ్యంగా నిర్మాతలకు లాభాలను ఆర్జించి పెట్టడంతో హీరోయిన్లు తమ పారితోషికాలను పలు రె ట్లు పెంచేస్తున్నారు.
 
నయనాధిక్యం: ఇక నేటి ప్రముఖ కథానాయికల పారితోషికాలను ఒక్కసారి పరిశీలిస్తే వామ్మో అనిపించక మానదు.పలు సంచలనాలకు కేంద్రంగా మారి ఒక దశలో నటనకు గుడ్‌బై కూడా చెప్పేసి మళ్లీ నటనను ఆశ్రయించిన నటి నయనతార ప్రాచుర్యంతో పాటు పారితోషికం విషయంలోనూ తన ఆధిక్యాన్ని చాటుకుంటున్నారు.ఇటీవల ఆమె నటించిన తనీఒరువన్, మాయ, నానుమ్ రౌడీదాన్ చిత్రాలు వరుసగా విజయాలు సాధించడం గమనార్హం. అందులో మాయ చిత్రం ఆమె చుట్టూ తిరిగే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం కావడంతో ఆ చిత్ర విజయం నయనతార సొంతం అయ్యిపోయింది. ఆ తరువాత ఆ తరహా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు నయనతారను వెతుక్కుంటూ రావడం గమనార్హం.దీంతో ఆమె తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచేశారు.కాగా ఇటీవల ఒక హారర్ కథా చిత్రం అవకాశం రాగా నయనతార నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు,ఆ చిత్ర దర్శక నిర్మాతలు ముచ్చెమటలు పోయడంతో మరో మాట లేకుండా వెనుదిరిగినట్లు ప్రచారం జరిగింది.అందువల్ల నయనతార పారితోషికం మూడు కోట్ల వద్ద పుల్‌స్టాప్ పడినట్లు సినీ వర్గాల టాక్.
 ఇక పారితోషికం విషయంలో రెండో స్థానంలో ఉన్న నటి అనుష్క. అరుంధతి చిత్రం తరువాత ఈ యోగా సుందరి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి.అది బాహుబలి వరకూ అప్రహతంగా సాగుతూ వస్తోంది.

దానితో పాటు పారితోషికం పెంచుకుంటూ పోయారు.ప్రస్తుతం అనుష్క రూ.1.5 కోట్ల నుంచి 2కోట్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం.అదే విధంగా చెన్నై చిన్నది సమంత కూడా రూ. 1.45 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. నటి కాజల్‌అగర్వాల్ కోటి నుంచి కోటిన్నర వరకూ డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. ఈమె తెలుగులో చందమామ తదితర చిత్రాల విజయాల తరువాత రూ.20 లక్షల పారితోషికం అందుకున్నారు.అయితే మగధీర చిత్రం కాజల్ క్రేజ్‌ను అమాంతంగా పెంచేసింది. అదే విధంగా తమిళంలో తుపాకీ,జిల్లా వంటి చిత్రాల విజయాలు ఈ బ్యూటీకి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక గుజరాతీ గమ్మ తమన్న సినిమాల్లోకి రాక ముందు వాణిజ్య ప్రకటనలకు రెండు వేల చొప్పున పారితోషికం పుచ్చుకున్నారు. ఇప్పుడామె అందుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అదనపు కాల్‌షీట్స్ అడిగితే మరో రూ.20 లక్షలు డిమాండ్ చేస్తారట. ఈ ముద్దుగమ్మ ఇటీవల ఐటమ్ సాంగ్స్ స్పెషల్‌గా వాసికెక్కారు. ఒక్కో పాటకు 40 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇక ఫ్లాప్‌లతో కెరీర్‌ను ప్రారంభించి అనూహ్యంగా విజయాల బాట పట్టిన నటి శ్రుతిహాసన్. గ్లామర్‌కు అర్థం ఏమిటని ఎదురు ప్రశ్నలు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలారబోతలో సాటిలేరు తనకెవ్వరూ అన్నంతగా పేరు తెచ్చుకుని తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ఈమె ఇప్పుడు కోటి వరకూ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు నక్షత్ర హోటళ్లు, షూటింగ్‌లో క్యారవన్ వ్యాన్ ఖర్చులు అంటూ అదనంగా నిర్మాతలకు తడిపిమోపెడవుతుంది. ఈ బ్యూటీస్ మల్టీ పర్పస్ హీరోయిన్లు కావడంతో నిర్మాతలు కోట్లలో పారితోషికాలు చెల్లించడానికి వెనుకాడడం లేదు.తమిళంలో నటించే చిత్రాలు తెలుగు తదితర భాషల్లోనూ కలెక్షన్లు రాబట్టడానికి ఈ కథానాయిక క్రేజ్ చాలా ఉపయోగ పడుతుండటం భారీ పారితోషికాలకు ఒక కారణం అని చెప్పవచ్చు.