బాత్‌టబ్‌లో రిపోర్టర్‌.. నెటిజన్ల విస్మయం!

28 Feb, 2018 09:22 IST|Sakshi

శ్రీదేవి ఆకస్మిక మృతి.. టీవీ చానళ్ల ‘అతి’

జర్నలిజానికి బాత్‌టబ్‌కు దిగజార్చిన వైనం

సోషల్‌ మీడియాలో విమర్శలు

అతిలోకసుందరిగా పేరు గడించిన శ్రీదేవికి దేశవ్యాప్తంగా పాపులారీటీ ఉంది. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఈ పాపులారిటీ నేపథ్యంలోనే ఆమె ఆకస్మిక మృతి కథనాల విషయంలో జాతీయంగా, దాదాపు అన్నిరా ష్ట్రాల్లోనూ మీడియా  అత్యుత్సాహం ప్రదర్శించింది. దుబాయ్‌లో శ్రీదేవి ఆకస్మిక మృతి.. ఈ తర్వాత చోటుచేసుకున్న ఒకింత నాటకీయ పరిణామాలు.. ఆమె గుండెపోటుతో కాకుండా బాత్‌టబ్‌లో మునిగిచనిపోయిందని పోలీసులు తేల్చడం.. ఇవన్నీ న్యూస్‌ చానళ్లకు కావాల్సినంత సరంజామా ఇచ్చాయి. దీంతో కొన్ని న్యూస్‌ చానెళ్లు మరీ అత్యుత్సాహంతో వెర్రితలలు వేయడంపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీదేవి ఆకస్మిక మృతి విషయంలో న్యూస్‌ చానెళ్లు జర్నలిజాన్ని బాత్‌టబ్‌కు దిగజార్చడం.. బాత్‌టబ్‌లోకి కూరుకుపోయి మరీ కథనాలు ప్రసారం చేయడం నెటిజన్లకు వెగటు పుట్టిస్తోంది.

శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగిచనిపోయిందని వెల్లడైన ఫిబ్రవరి 26న దాదాపు అన్ని జాతీయ చానళ్లు, ​ప్రాంతీయ చానళ్లు బాత్‌రూమ్‌ను టీవీ స్క్రీన్‌ మీదకు తీసుకొచ్చాయి. బాత్‌టబ్‌ కొలతలు ఇచ్చాయి. తమ కంప్యూటర్‌ జనరేటెడ్‌ గ్రాఫిక్‌ స్కిల్స్‌కు పదునుపెట్టి.. స్టూడియోలోనే తమ డిటెక్టివ్‌ బుద్ధికి రెక్కలు విప్పి.. కోడిగుడ్డ మీద ఈకలు పీకన చందంగా కథనాలు వండివార్చాయి. కొన్నిచానళ్లు ఏకంగా బాత్‌టబ్‌లో శ్రీదేవి ఫొటోలు పెట్టి.. ‘మోత్‌కా బాత్‌టబ్‌’ అంటూ తమ అతి సృజనాత్మకతను ప్రదర్శించాయి. మరికొన్ని చానళ్లయితే బాత్‌టబ్‌లో శ్రీదేవి పడి ఉంటే..బోనీకపూర్‌ వచ్చి చూసినట్టు తమ ఫోటోషాపింగ్‌ స్కిల్స్‌ను ప్రదర్శించుకున్నాయి.

శ్రీదేవి మొదట గుండెపోటుతో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్‌లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని పోలీసులు తేల్చారు. అయితే, ఆ సమయంలో ఆమె దేహంలో ఆల్కహాల్‌ జాడలు ఉన్నాయని ఫోరెన్సిక్‌ నివేదికలో తేల్చారు. ఈ సమాచారాన్ని పట్టుకొని.. ఒక టీవీ చానల్‌ బాత్‌టబ్‌ మీద వైన్‌ గ్లాస్‌.. మరోవైపు శ్రీదేవి ఫొటో పెట్టి కథనాలు వండివార్చింది. ఇక, జాతీయస్థాయిలో పోటాపోటీగా కథనాలు ప్రచురించే రిపబ్లిక్‌, టైమ్స్‌ నౌ చానళ్లు కూడా శ్రీదేవి డెత్‌ మిస్టరీ అంటూ ప్రైమ్‌టైమ్‌లో తమ డిటెక్టివ్‌ కథనాల ప్రసారంలో అత్యుత్సాహం చూపాయి. మిగతా చానళ్లు కూడా ప్రధాన వార్తలు గాలికొదిలేసి.. ప్రైమ్‌టైమ్‌ లో శ్రీదేవి మృతి విషయంలోనే చర్చలు నడిపాయి.

బాత్‌టబ్‌లో రిపోర్టర్‌..!
ఓ ప్రాంతీయ చానల్‌కు చెందిన రిపోర్టర్‌ బాత్‌టబ్‌లోకి దిగి మరీ రిపోర్టింగ్‌ చేయడంపై సోషల్‌ మీడియాలో విస్మయం వ్యక్తమవుతుంది. దీనిపై నెటిజన్లు జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. శ్రీదేవిది బాత్‌టబ్‌ మరణం కాబట్టి బాత్‌టబ్‌లోకి దిగారు.. ఒకవేళ ఎవరైనా ఉరివేసుకుంటే..రిపోర్టర్‌ కూడా ఉరి వేసుకున్నట్టు కనిపిస్తూ.. రిపోర్టింగ్‌ చేస్తారా? నెటిజన్లు ప్రశ్ని‍స్తున్నారు. మొత్తానికి శ్రీదేవి మృతి విషయంలో కొన్ని చానళ్లు సాగించిన చిలువలపలువల ప్రచారం,చానళ్ల అత్యుత్సాహంపై సోషల్‌ మీడియా ఘాటుగా స్పందించింది.‘ఇప్పుడు నడుస్తోంది బ్యాడ్‌ జర్నలిజం కాదు.. బాత్‌టబ్‌ జర్నలిజం’ అంటూ కత్తి మహేశ్‌ టీవీ చానళ్ల ధోరణిపై ట్వీట్‌ చేశారు. మొత్తానికి ఓవైపు టీవీ చానళ్ల వికృత ధోరణిని పరిహాసిస్తూనే.. మరోవైపు శ్రీదేవి మృతివిషయంలో వదంతులు ప్రచారం చేయకుండా ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ..నెటిజన్లు పెద్ద ఎత్తున లెట్‌హార్‌రెస్ట్‌ఇన్‌పీస్‌ యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ అయ్యేలా చేశారు.

మరిన్ని వార్తలు