యూ'స్టార్స్‌'.. గంగవ్వకు జై..

28 Feb, 2020 10:47 IST|Sakshi

యూట్యూబ్‌ ఛానల్స్‌లో సిటీ యువత హల్‌చల్‌ చేస్తోంది. లక్షలు,మిలియన్‌ మంది వీక్షకుల మదిని దోచేస్తూ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ సృష్టిస్తున్నారు.. కంటెంట్‌ కన్నా మిన్నగా డైలాగ్‌ డెలివరీ,రక్తికట్టించే నటీనటుల హావభావాలు వీక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ప్రాచుర్యం కోసం ఒకప్పుడు సినిమా, టీవీ అవకాశాల వైపు మాత్రమే చూసిన యువత ఇప్పుడు సోషల్‌ వేదికలనే టార్గెట్‌ చేస్తోంది.సిటీయువత నిర్వహిస్తున్న కొన్న యూ ట్యూబ్‌ చానెల్స్‌ విశేషాలివి...

 గ్రామీణ నేపథ్యమే..సక్సెస్‌కు సారథ్యం...
పండుగల విశిష్టతను చాటుతూ అచ్చమైన తెలంగాణ యాసలో గ్రామీణ నేపథ్యంతో క్రియేటివ్‌ థింక్స్‌ ఆకట్టుకుంటోంది. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ‘మాకాడ మహాశివరాత్రి’ లఘుచిత్రం వీక్షకుల్ని మెప్పించింది. గంగమ్మ (నది) చెంతకు వెళ్ళి మట్టితో శివలింగం చేసి అభిషేకం చేయడం, గ్రామంలోనే పూజ చేసేందుకు అవసరమయ్యే వస్తువుల సేకరించడం,  ఆ తరువాత జాగరణ వంటి పండుగ విశేషాలతో తెరకెక్కించిన ఈ లఘు చిత్రం నాలుగు రోజుల్లోనే 1.2 మిలియన్‌ వ్యూస్‌ అందుకుంది.  
వాలంటైన్స్‌ డే పురస్కరించుకుని ‘లవ్‌ దే’ పేరిట అప్‌లోడ్‌ చేసిన వీడియో వారం వ్యవధిలోనే 1.4 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. లవర్స్‌ కాని జంటకు ప్రేమ్‌దళ్‌ పేరిట కొందరు యువకులు పెళ్ళి చేయడం, ఆ పెళ్ళి విషయం ఇంట్లో  తెలవగా వారు ఏవిధంగాఆ పెళ్ళి తంతు నుంచి బయటపడ్డారో అనేది వీక్షకులను కడుపుబ్బా నవ్వించింది.  
మాఘమాసం మంట, అష్టాచమ్మా, బరుతుడే, విలేజ్‌లో గండాలు, విలేజ్‌లో శ్రీమంతుడు, సెల్‌ కల్లు తాగితే, అప్పాలు చేయబోతే, థర్టీఫస్ట్‌ దావత్, మాకాడ బతుకమ్మ వంటి లఘు చిత్రాలు హిట్స్‌ కొట్టాయి. వీరు తెరకెక్కించే ప్రతి వీడియోలోనూ గ్రామీణ వాతావరణం తప్పనిసరిగా కనిపిస్తుంది.  ఇప్పటివరకు 58 వీడియోల ద్వారా వీక్షకులకు వినోదాన్ని పంచింది. ప్రస్తుతం 1.15 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌తో దూసుకుపోతోంది.

గంగవ్వకు జై..
హాస్యపు జడివానలో వీక్షకులను తడిసిముద్దయ్యేలా చేస్తోంది మై విలేజ్‌ షో అంతేకాదు కొత్త సినిమాలకు ప్రమోషన్‌కు అడ్డాగా కూడా ఇది అవతరించింది. ఇందులో గంగవ్వ నటన ఎనలేని ఆదరణ పొందింది.  నకిలీ పోలీసులు ఏవిధంగా దండుకుంటున్నారు,  ఆర్టీఏ కార్యాలయం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తప్పుడు చలాన్లను ఇళ్ళకు పంపించి ఏవిధంగా తమ అకౌంట్‌లో డబ్బును జమ చేయించుకుంటున్నారు?ఇలాంటివి హాస్య నేపథ్యంగా  చూపించిన తీరు హాట్సాఫ్‌ అనిపించుకుంది.  ‘విలేజీలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ పేరిట అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో 4.2 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్‌ చేసేసింది.  ఇదే కోవలో ‘చేపల దొంగలు’ వీడియోకు 5.3 మిలియన్‌ వ్యూస్‌ వచ్చి చేరాయి. 31 దావత్‌ ప్లాన్‌ చేస్తే, విలేజ్‌ సమ్మర్‌ ప్రాబ్లమ్స్, దొంగల భయం, పిసినారి రాజు, విలేజ్‌లో దీపావళి, అమెరికా సోకు, ఇస్మార్ట్‌ గంగవ్వ, కరోనా కలకలం, విజయ్‌ పెండ్లి గోసలు, విలేజ్‌ పబ్‌ వంటి కామెడీ వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్‌ను మూటగట్టుకున్నాయి. అలాగే బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు సినిమా ప్రమోషన్‌ కోసం చేసిన వీడియో సైతం హల్‌చల్‌ చేసింది. 2019లో యూట్యూబ్‌ తెర పైకి వచ్చిన మై విలేజ్‌ షో ఛానల్‌లో ఇప్పటివరకు 193 వీడియోలు వినోదాన్ని పంచాయి. 1.3 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌తో దూసుకుపోతుంది. 

దంచికొడుతున్న దేత్తడి..

‘దేత్తడి’ ఛానల్‌ మోస్ట్‌ పాపులర్‌ అయ్యింది. ఇందులో హారిక అలేఖ్య నటన కుర్రకారుకు క్రేజీగా మారింది.  2018 ఏప్రిల్‌లో యూట్యూబ్‌లోకి ప్రవేశించిన ఈ ఛానల్‌ ఇప్పటికే 1 మిలియన్‌ పైచిలుకు సబ్‌స్క్రైబర్స్‌ను సొంతం చేసుకుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు కామెడీని జోడించి తెరకెక్కించే తీరు వీక్షకులకు దగ్గర చేసింది. మెడికల్‌ షాప్‌కు వచ్చే వారి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు మెడికల్‌ దుకాణం పేరిట తీసిన షార్ట్‌ వీడియో రెండు నెలల్లోనే 1 మిలియన్‌ వ్యూవర్స్‌ను మూటగట్టుకుంది. దేత్తడి ఛానల్స్‌ ద్వారా ఇప్పటివరకు అప్‌లోడ్‌ చేసిన 94 వీడియోలు యూట్యూబ్‌ లవర్స్‌ మదిని దోచేశాయనే చెప్పాలి. సినీనటుడు సుశాంత్‌ సైతం హారికతో జతకట్టి ‘పెళ్ళి గోల’ షార్ట్‌ఫిల్మ్‌లో వినోదాల జల్లులు కురిపించారు.

మరిన్ని వార్తలు