ప్రతిరోజూ బీచ్‌లో కూర్చునేవాడిని: సాయిధరమ్‌

9 Feb, 2020 12:23 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సాయిధరమ్‌ తేజ్‌

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రానికి సంబంధించి విశాఖపట్నంలో జరిగిన షూటింగ్‌ తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌లో శనివారం నిర్వహించిన సినిమా షూటింగ్‌ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోలో లైఫ్‌లో ఓ యువకుడికి ఎదురైన అనుభవాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 1న విడుదల కానుందని తెలిపారు. 25 రోజులుగా నగరంలో చిత్ర యూనిట్‌ షూటింగ్‌ జరుపుతోందని, శనివారం ఉదయం కైలాసగిరి కొండపై కొన్ని సన్నివేశాలు చిత్రించి, ఫిషింగ్‌ హార్బర్‌లో షూటింగ్‌కు వచ్చామని తెలిపారు. విశాఖ నగరం ఎంతో అందమైన ప్రదేశమని, తాను హీరో అయిన తరువాత తొలిసారిగా విశాఖలో షూటింగ్‌ జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తున్నామని, ఈ చిత్రంలో నగరాన్ని మరింత అందంగా చూపించనున్నామని తెలిపారు.

డైరెక్టర్‌ కొత్తవారైనా తనకు చెప్పిన కథను యథాతధంగా చిత్రీకరించడం అభినందనీయమన్నారు. హీరోయిన్‌ నభా నటేష్‌ ఎంతో ప్రతిభ కనబరిచారని, ఆమె మాతృభాష తెలుగు కానప్పటికి తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారని తెలిపారు. సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాను మాత్రం విశాఖ అందాలను బాగా ఎంజాయ్‌ చేసానని, ప్రతిరోజు బీచ్‌లో కూర్చుని అలలను చూస్తూ ఆనందంగా గడిపానని అన్నారు. కథానాయిక నభా నటేష్‌ మాట్లాడుతూ సినిమా అద్భుతంగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని తెలిపారు. దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ తాను తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందినవాడినని తెలిపారు. మొట్టమొదటి సారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని అన్నారు. సంగీతాన్ని తమన్‌ అందించారని పేర్కొన్నారు. (చదవండి: ‘సోలో సోదర సోదరిమణులారా.. మన స్లోగన్‌ ఒక్కటే’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా