జాగ్రత్తగా ఉండండి 

18 Mar, 2020 03:45 IST|Sakshi

కోవిడ్‌ 19 (కరోనావైరస్‌) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే దేశ, విదేశాల్లో ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు తమ వంతు సూచనలను, సలహాలను ప్రజలకు చెబుతున్నాయి. కోవిడ్‌ 19పై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి. సినిమా స్టార్స్‌ కూడా తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ట్వీట్స్, వీడియోల రూపంలో జాగ్రత్తలు చెబుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్టార్స్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కలిసి కోవిడ్‌ 19 (కరోనా వైరస్‌) వ్యాప్తి చెందకుండా ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను చెప్పిన వీడియో సోమవారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇంకొందరు స్టార్స్‌ చెప్పిన విషయాలు ఈ విధంగా... 

త్యాగం చేద్దాం  – మహేశ్‌బాబు

కరోనా వైరస్‌ వల్ల వచ్చే సమస్యలను, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఈ విషయం గురించి ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలోని సారాంశం ఏంటంటే.. వరుసగా  ఓ యాభై అగ్గిపుల్లలను నిలబెట్టారు. మొదటి అగ్గిపుల్లకు నిప్పు అంటిస్తే ఒక అగ్గిపుల్ల నుండి మరో అగ్గిపుల్ల వేగంగా అంటుకుంటుంది. అవి ఓ సమూహంలా ఉన్నాయి కాబట్టే నిప్పు అంటుకుంది. అయితే ఓ అగ్గిపుల్లని వేరు చేస్తే అక్కడినుండి మిగిలిన అగ్గిపుల్లలకి మంట అంటలేదు.

కరోనా వైరస్‌ కూడా ఓ సమూహంలా ఉంటే వేగంగా అంటుకుంటుంది. గుంపులో ఉంటేనే ఒకరి నుండి మరొకరికి అంటుకుంటుంది. విడిగా ఎవరికి వారుగా ఉంటే ఒకరి ద్వారా ఒకరికి వ్యాప్తి చెందదు అనేది వీడియోలోని సారాంశం. ‘‘ఈ సమయంలో మనందరం సామాజికంగా ఒకరికొకరం దూరంగా ఉండాల్సిన పరిస్థతి. అది కష్టమైనప్పటికీ ఈ నిమిషంలో మనందరం కలిసికట్టుగా సమాజానికి వీలైనంత దూరంగా ఉంటేనే ఈ విపత్తు నుండి బయటపడటానికి సాధ్యమవుతుంది. పబ్లిక్‌ లైఫ్‌ బావుండాలంటే పర్సనల్‌గా మనందరం త్యాగం చేయాల్సిందే. వీలైనంతగా ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ మరికొన్ని సలహాలు కూడా ఇచ్చారు.


ఇది మనందరి ఆరోగ్యాలకు పరీక్షాకాలం. పబ్లిక్‌ సేఫ్టీకి ఓ చాలెంజ్‌. కోవిడ్‌ 19 అనే మహమ్మారిపై విజయం సాధించేందుకు మనమందరం బాధ్యత వహించాలి. ప్రభుత్వ, ఆరోగ్య సంస్థల సూచనలు, సలహాలను పాటిద్దాం. ఈ కోవిడ్‌ 19 గురించిన తప్పుడు సమాచారానికి దూరంగా ఉందాం. – ప్రభాస్‌


రాజకీయాలు, కులం, మతం, అధికారం, డబ్బు, కీర్తి.. ఏమీ ఉండవు. చివరికి మనిషికి మనిషే. మనమందరం ఒకే కుటుంబం. ఒకరినొకరం సంరక్షించుకుందాం. బాధ్యతగా ఉండి సురక్షితంగా ఉందాం. – నాని


‘కోవిడ్‌ 19’ వైరస్‌పై అవగాహన లేనివారికి, మాస్కులు, శానిటైజర్స్‌ను కొనలేనివారికి నా వంతు సహాయం చేస్తున్నాను. సూచనలు, సలహాలు పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. శానిటైజర్స్‌ పంచమని తమను పంపారని కొందరు ఇంట్లోకి వచ్చి దొంగతనానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అలా పంపిణీ చేయమని ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు. అలాంటి వారి పట్ల జాగ్రత్త వహించండి. 
– మంచు మనోజ్‌


కోవిడ్‌ 19 వైరస్‌ ప్రపంచంలో సృష్టిస్తోన్న కలకలాన్ని దృష్టిలో ఉంచుకుని మా పూరీ కనెక్ట్స్‌ సంస్థలోని అన్ని కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. మా అందరి నిర్ణయం ఇది. ప్రభుత్వం, అధికారిక ఆరోగ్య ప్రతినిధులు ఇచ్చే సలహాలు, సూచనలను అందరూ పాటించండి. పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండండి. సమష్టి కృషితో ఈ కోవిడ్‌ 19 అనే యుద్ధాన్ని గెలుద్దాం. –  పూరి జగన్నాథ్, చార్మి


కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ఇలాంటి సమయంలోనే మనం కంగారు పడకూడదు. పుకార్లను ప్రచారం చేయకూడదు. బాధ్యతగల పౌరులుగా మనం పరిశుభ్రంగా, జాగ్రత్తగా ఉండాలి. దగ్గు, జలుబు ఉన్నవారు ఇతరులకు కాస్త దూరంగా ఉండటం మంచిది  – గాయని లతా మంగేష్కర్‌


మన దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. భయంకరమైన ఈ వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్‌ లేదు. మనందరం ప్రభుత్వాలకు సహకరిద్దాం. వారి సూచనలు, జాగ్రత్తలను పాటిద్దాం 
– నటి హేమమాలిని


ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రస్తుతం మనదేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది. అందుకే మా ధర్మ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన అన్ని పనులను నిలిపివేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు, మా సంస్థలో పని చేస్తున్న వారందరి క్షేమం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సూచనలు, ఆదేశాలు వచ్చిన తర్వాత మా పనులను తిరిగి ప్రారంభిస్తాం. – కరణ్‌ జోహార్‌


వ్యాయామం, యోగ వంటివి చేసి మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకుందాం. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. –  కత్రినా కైఫ్


కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న దేశాల్లో ఎలాంటి చెడు పరిణామాలు జరుగుతున్నాయో అవి మన దేశంలో జరగకుండా జాగ్రత్త పడదాం. అందరం బాధ్యతాయుతంగా ఉందాం. తర్వాత పశ్చాత్తాపం చెంది ప్రయోజనం లేదు. – పరిణీతి చోప్రా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా