‘నాన్న.. ఈ పని ఎప్పుడో చేయాల్సింది ’

30 Mar, 2019 09:22 IST|Sakshi

ముంబై : బీజేపీని వీడి తన తండ్రి మంచి పనిచేశారని బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా అన్నారు. గౌరవం లేని చోట ఉండే బదులు కనీస మర్యాద పాటించే వారి సమక్షంలో ఉండటం ఉత్తమమని పేర్కొన్నారు. మూడు దశాబ్ధాల పాటు బీజేపీలో కొనసాగిన బీజేపీ రెబల్‌ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో ఏప్రిల్‌ 6న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన కూతురు సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ‘ నాకు తెలిసి చాలా ఏళ్ల క్రితమే మా నాన్న ఈ పని చేయాల్సింది. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీలో ఆయనకు తగిన గౌరవమర్యాదలు ఎప్పుడూ లభించలేదు’ అని వ్యాఖ్యానించారు.

కాగా బిహార్‌లోని పట్నాసాహిబ్‌ లోకసభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందిన శత్రుఘ్న సిన్హాకు బీజేపీ ఈ సారి టికెట్‌ నిరాకరించింది. ఆ సీటును కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేటాయించింది. దీంతో తనకు టికెట్‌ నిరాకరించిన బీజేపీ నాయకత్వానికి తానూ అదేస్ధాయిలో బదులిస్తానని సిన్హా ఇదివరకే స్పష్టం చేశారు. అద్వానీకి గాంధీనగర్‌ నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం పట్లా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగ్గజ నేతను రాజకీయాల నుంచి వైదొలిగేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తోందని మం‍డిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. రవిశంకర్‌కు పోటీగా కాంగ్రెస్‌ శత్రుఘ్న సిన్హాను బరిలో దించనున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు