అవకాశమొస్తే ఆయనతో చేస్తా!

9 Feb, 2017 06:33 IST|Sakshi
అవకాశమొస్తే ఆయనతో చేస్తా!

ఆ కథానాయకుడితో నటించడానికి ఏ మాత్రం సందేహించను అంటున్నారు నటి సోనాక్షిసిన్హా. దక్షిణాది భామలు బాలీవుడ్‌ మోహంలో పడుతుంటే. అక్కడి బ్యూటీస్‌ దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతుండడం విశేషం. నటి దీపికాపదుకునే, సోనాక్షి సిన్హా, ప్రియాంకాచోప్రా, కంగనారావత్‌ వంటి బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఇప్పటికే కోలీవుడ్‌ చిత్రాల్లో నటించారన్నది తెలిసిందే. వీరంతా మళ్లీ తమిళ చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్నసిన్హా వారసురాలైన సోనాక్షి సిన్హా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా లింగా చిత్రంలో నటించారు.

ఇక దీపికాపదుకోనే కోచ్చడైయాన్‌ చిత్రంలో సూపర్‌స్టార్‌తో రొమాన్స్‌ చేశారు. వీరిద్దరిని మళ్లీ మళ్లీ కోలీవుడ్‌ చిత్రాల్లో నటించాలని ఇక్కడి దర్శక నిర్మాతలు కోరుకుంటున్నారు. ఇప్పటికే సంఘమిత్ర అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో జయంరవి, ఆర్యలకు జంటగా నటించజేయడానికి దర్శకుడు సుందర్‌.సీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటి సోనాక్షిసిన్హాను ఇళయదళపతి విజయ్‌ సరసన నటింపజేసే ఆలోచనలో దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ ఉన్నట్లు తాజాసమచారం. విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన 61వ చిత్రం. దీని తరువాత ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌.

ఇందులో సోనాక్షిసిన్హాను నాయకిగా ఎంపక చేసే పనిలో యూనిట్‌ వర్గాలు ఉన్నట్లు సమాచారం. దీని గురించి ఇటీవల చెన్నైకి వచ్చిన సోనాక్షిసిన్హాను అడగ్గా విజయ్‌కు జంటగా నటించడానికి తాను ఏ మాత్రం సంశయించను అన్నారు. అదీ ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడం అంటే చాలా ఇష్టం అన్నారు. ఆయన దర్శకత్వంలో ఇప్పటికే హిందీలో అకిరా, హాలీడే చిత్రాల్లో నటించాను. తనను హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటింపజేసిన దర్శకుడాయన. ఇంకా చెప్పాలంటే తనకు తమిళ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి చాలా ఉందన్నారు.

తమిళంలో తింగా చిత్రంలో నటించానని, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం వల్ల తాను బాధ పడడం లేదని అన్నారు. కారణం అందులో కొందరు అద్భుత వ్యక్తులతో పని చేసే అవకాశం కలిగిందని అన్నారు. రజనీకాంత్‌తో నటించడం చాలా గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. రజనీకాంత్, ఏఆర్,.మురుగదాస్‌ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. తాను విజయ్‌ నటించిన తుపాకీ, కత్తి చిత్రాలను చూశానన్నారు. విజయ్‌ ఉత్తమ నటుడని పొగడ్తల్లో ముంచెత్తారు.ఆయనతో నటించే అవకాశం వస్తే ఏ మాత్రం సందేహించకుండా అంగీకరిస్తానని సోనాక్షిసిన్హా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా