కునుకు లేదు.. కన్నీళ్లే

4 May, 2019 03:43 IST|Sakshi
సోనాలీ బింద్రే

సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిసి ఆమె అభిమానులంతా షాక్‌ అయ్యారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సోనాలీ న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుని క్షేమంగా ఇండియా తిరిగొచ్చారు. అభిమానులే అల్లల్లాడిపోతే క్యాన్సర్‌ ఉందన్న వార్తను విన్నప్పుడు సోనాలి బింద్రే ఎలా తీసుకున్నారు? ఎలా తట్టుకున్నారు? ఈ ప్రశ్నకు ఓ షోలో సోనాలీ సమాధానమిస్తూ – ‘‘ముందుకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఓ మైగాడ్‌ అనుకున్నాను. వేగంగా వెళ్లే ట్రైన్‌ వచ్చి బలంగా తాకినట్టు ఆ వార్త నన్ను కుదిపేసింది. ఆ రాత్రంతా నిద్రపోలేదు, ఏడుస్తూనే ఉన్నాను. బాగా ఏడ్చాను.

ఎందుకంటే.. నాకే ఎందుకిలా జరుగుతుంది? అంటూ బాధపడే ఆఖరి రోజు ఇదే కావాలని బలంగా కోరుకుంటూ ఏడ్చాను. ఇకమీదట అంతా సంతోషమే, నవ్వులే ఉండాలని అనుకున్నాను. మనకు నచ్చనివి జరిగినప్పుడు నమ్మడానికి ఇష్టపడం. ఆ రాత్రి నాకు క్యాన్సర్‌ అనే విషయాన్ని అంగీకరించగలిగాను. క్యాన్సర్‌ను యాక్సెప్ట్‌ చేశాను. ఆ సమయంలో నా భర్త గోల్డీ బెహల్, సుస్సానే ఖాన్, గాయత్రీ నాతోనే నిలబడ్డారు. గోల్డీ, నేను 16 ఏళ్లుగా కలసి ఉంటున్నాం. క్యాన్సర్‌ గురించి తెలిశాక గోల్డీ నా జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను  అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటిరోజు ఉదయాన్నే సూర్యుడు రావడాన్ని ఫోటో తీశాను. ‘స్విచ్చాన్‌ ది సన్‌షైన్‌’ అంటూ నా ఫ్రెండ్స్‌కు ఆ ఫోటోలు పంపించాను’’ అని పేర్కొన్నారు సోనాలి.

మరిన్ని వార్తలు