బతికే అవకాశం తక్కువన్నారు

5 Apr, 2019 03:52 IST|Sakshi
సోనాలీ బింద్రే

క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు నటి సోనాలీ బింద్రే. తన పోరాట ప్రయాణం గురించి ఆమె పలు సందర్భాల్లో పలు విషయాలను వెల్లడించారు. తాజాగా ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సోనాలి. వాటిలోని సారాంశం ఈ విధంగా...  ‘‘మన అనుభవాలు మనల్ని ఎలా మార్చాయని వివరించడానికి ప్రత్యేకమైన విధానం ఏదీ లేదు. మనలో వచ్చిన ప్రతి పరివర్తనకు దృశ్యరూపం ఉండకపోవచ్చు. క్యాన్సర్‌ చికిత్స కోసం గోల్డీ బెహల్‌ (సోనాలీ భర్త) నన్ను న్యూయార్క్‌ తీసుకుని వెళ్లారు.

అక్కిడికి వెళ్లిన తర్వాతి రోజే డాక్టర్లను సంప్రదించాం. పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ స్కాన్‌ చేయించుకున్నాక తెలిసింది.. నాకు క్యాన్సర్‌ ఫోర్త్‌ స్టేజ్‌లో ఉందని. పైగా నా పొత్తి కడుపు అంతా క్యాన్సర్‌ వ్యాప్తి చెందిందని, నేను బతికే అవకాశం ముప్పైశాతమే ఉందని డాక్టర్లు చెప్పారు. ఒక్కసారిగా మనసు బద్ధలైంది. కలత చెందాం. కానీ అధైర్య పడలేదు. చికిత్సలో భాగంగా చాలా కాలం కష్టపడాల్సి వస్తుందనుకున్నాను. అయితే నేను చనిపోబోతున్నాననే ఆలోచన నాకు రాలేదు’’ అంటూ తాను కోలుకోవడానికి కారణం భర్త, స్నేహితులు, సన్నిహితులు అని పేర్కొన్నారు సోనాలీ బింద్రే.

మరిన్ని వార్తలు