సంతోషంగా ఉన్నా

6 Aug, 2018 00:16 IST|Sakshi
స్నేహితులతో సోనాలీ బింద్రే

సమస్య వచ్చినప్పుడు బాధపడిపోకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, అందులో కూడా పాజిటివ్‌నెస్‌ని ఎలా వెతుక్కోవాలో సోనాలీ బింద్రేని చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తోంది. కేన్సర్‌ వ్యాధి సోకినా భయపడకుండా ధైర్యంగా, ముఖం మీద నవ్వు చెదరకుండా పోరాడటానికి సిద్ధపడ్డారు సోనాలీ. ఆ మధ్య జుత్తుని సగానికి కత్తిరించుకున్న ఆమె తాజాగా గుండు చేయించుకున్నారు. తన ఆరోగ్యం గురించి చెప్పడంతో పాటు తన స్నేహితులందరికీ ఫ్రెండ్‌షిప్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ లేఖ రాశారు.

దాని సారాంశం ఈ విధంగా... ‘‘ఈ నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మాట చెబితే మీరందరూ నా వంక అదోలా చూడొచ్చు. కానీ అది నిజం. ఎందుకు చెబుతున్నానో వినండి. ప్రస్తుతం నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా తీసుకుంటున్నాను. ఆనందం దొరికే ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. నిజమే.. కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. నిరాశ, నిస్పృహ నన్ను ముంచేస్తాయి. కానీ, నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తున్నాను. నాకు నచ్చిన వాళ్లతోనే టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాను. దాంతో చాలా హ్యాపీగా ఉంటున్నాను. నా ఫ్రెండ్స్‌.. నా ధైర్యానికి వాళ్లే కారణం.

వాళ్ల బిజీ షెడ్యూల్స్‌లో కూడా నా కోసం మెసేజ్, ఫోన్‌ కాల్, వీడియో కాల్‌ ఏదోటి చేసి నాతో టచ్‌లోనే ఉంటున్నారు. ఒక్క క్షణం కూడా నన్ను ఒంటరిగా ఫీల్‌ అయ్యేలా చేయడం లేదు. నిజమైన ఫ్రెండ్‌షిప్‌ అంటే ఏంటో తెలియజేస్తున్నారు. హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే. మీ అందరూ నా లైఫ్‌లో ఉండటం నా అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఈ మధ్య రెడీ అవ్వడానికి ఎక్కువ టైమ్‌ కూడా పట్టడంలేదు. ఊరికే జుత్తు దువ్వుకునే పని లేదు కదా (నవ్వుతున్న ఎమోజీ). అన్నింట్లో పాజిటివిటీ వెతుక్కుందాం’’ అంటూ ఈ నోట్‌ను, ఫొటోను షేర్‌ చేశారు. సోనాలీ పట్టుదల చూస్తే అభినందించకుండా ఉండలేం కదూ.

>
మరిన్ని వార్తలు