మాధురీ దీక్షిత్ ఓ దేవతలా కనిపిస్తుంది: సొనాలీ బింద్రే

27 Jun, 2013 02:04 IST|Sakshi
మాధురీ దీక్షిత్ ఓ దేవతలా కనిపిస్తుంది: సొనాలీ బింద్రే

వందేళ్ల భారతీయ సినిమాలో నచ్చిన విషయాలేవో చెప్పమంటే చాలా కష్టమేనంటోంది బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే. ‘అలా చెప్పడం చాలా కష్టం. నచ్చిన అంశాల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు చాలవు. అయినప్పటికీ ఏవో కొన్ని చెప్పాలి కాబట్టి చెబుతున్నా..   నేను నటించిన చిత్రాల్లో జఖ్మ్, సర్ఫరోష్ అంటే చాలా ఇష్టం. గైడ్ సినిమా, మాధురీ దీక్షిత్ అంటే ఎంతో ఇష్టం. 1994లో వచ్చిన మహేశ్‌భట్ చిత్రం ‘నారాజ్’ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్రంలో నటించడం నాకో వింతైన అనుభవం. 1998లో వచ్చిన జఖ్మ్ కూడా అంతే. నా కెరీర్‌లో దీనినో ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకుంటా. ఇక ఆమిర్‌ ఖాన్ తో నటించిన సర్ఫరోష్ కూడా అంతే. అందులో నసీరుద్దీన్ షా నటన ఎంతో బాగుంటుంది.
 
 సినిమా మొత్తం నిజజీవితంలా సాగిపోతుంది. స్నేహం, ప్రేమ గురించి చెప్పే ‘నారాజ్’, తల్లీ బిడ్డల మధ్య ఉన్న అనుబంధం వివరించే ‘జఖ్మ్’ గురించి నా స్నేహితుల దగ్గర ఎన్నిసార్లు చెప్పుకున్నానో నాకే తెలియదు. ఇక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఓ పోలీస్ కథతో తెరకెక్కిన ‘సర్ఫరోష్’ సమాజంపట్ల మన బాధ్యత ఏమిటో చాటి చెబుతుంది. ఇక గైడ్ చిత్రంలో వహీదాజీ నటన ఎంతో బాగుంటుంది. ఆ సినిమాలోని ‘ఆప్ ఫిర్ జీనేకీ తమన్నా..’, ‘పియా తోసె నైనా లాలే రే..’ అంటూ సాగే పాటలు ఎప్పుడు విన్నా నన్ను నేనే మర్చిపోతాను. హృదయాన్ని కదిలించేలా ఉంటాయాపాటలు. ఇక బాలీవుడ్ నటీమణుల్లో మాధురీది ప్రత్యేకమైన స్థానం. ఒక్కోసారి ఆమె ఓ దేవతలా కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ సినిమాలో నాకు నచ్చిన విషయాలు ఎన్నో ఉన్నాయ’ని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాలీ చెప్పింది.