బంధుప్రీతికి సరికొత్త భాష్యం చెప్పిన సోనమ్‌

17 Apr, 2019 10:44 IST|Sakshi

బాలీవుడ్‌లో హీట్‌ రైజింగ్‌ టాపిక్‌ అంటే బంధుప్రీతి అనే చెప్పవచ్చు. ఇప్పటికే బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కుదిరినప్పుడల్లా ఈ విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి రెడీగా ఉంటారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌ బంధుప్రీతికి కొత్త భాష్యం చెప్పారు. ఆర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పించ్‌ కార్యక్రమానికి హాజరయ్యారు సోనమ్‌ కపూర్‌. ఈ సందర్భంగా తనను విమర్శిస్తూ వచ్చిన ఓ ట్వీట్‌ గురించి మాట్లాడారు. ఎవరో ఓ వ్యక్తి ‘పదేళ్ల నుంచి పరిశ్రమలో ఉంటున్నావ్‌.. ఇప్పటికి నీకు నటించడం రాద’ని విమర్శిస్తూ నెపోటిజమ్‌ అని హ్యాష్‌టాగ్‌తో ఓ ట్వీట్‌ చేశాడు.

ఈ విషయంపై సోనమ్‌ కపూర్‌ స్పందిస్తూ.. ‘పదేళ్ల నుంచి కాదు.. 11 ఏళ్ల నుంచి నేను పరిశ్రమలో ఉంటున్నాను. ఇంతకాలం నుంచి మీరంతా నన్ను ఆదరిస్తున్నందుకు.. అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు. బంధుప్రీతి అనే పదానికి ఈ రోజు అసలైన అర్థం చెప్పాలనుకుంటున్నాను. బంధుప్రీతి అనగానే అది ఓ వ్యక్తికి చెందినదిగా భావిస్తారు. కానీ అసలు అర్థం ఏంటంటే ఓ వ్యక్తితో ఉన్న సంబంధం వల్ల మీకు మంచి ఉపాధి దొరకడం. కానీ జనాలు తమ స్వలాభం కోసం దీన్ని తప్పుగా అర్థం చేసుకుని.. అవతలివారిని కించపరుస్తున్నారు’ అని పేర్కొన్నారు.

అంతేకాక ‘మా నాన్న ఓ ప్రముఖ కుటుంబం నుంచి రాలేదు. 40 సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో కష్టపడి పని చేస్తున్నారు. ఇదంతా ఆయన కుటుంబం కోసం.. పిల్లల కోసమే చేస్తున్నారు. మా కోసం ఆయన పడిన శ్రమను మేం సరిగా వినియోగించుకోకపోతే.. ఆయన కష్టానికి మేము మర్యాద ఇవ్వనట్లే. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కష్టపడేది వారి పిల్లల కోసమే కదా’ అంటూ చెప్పుకొచ్చారు. సోనమ్‌ తొలిసారి తండ్రి అనీల్‌ కపూరతో కలిసి ఏక్‌ లడ్కీ కో దేఖా థో హైసా లగా చిత్రంలో నటించారు.

మరిన్ని వార్తలు