క్యాబ్‌లో భయంకర అనుభవం: సోనమ్‌

16 Jan, 2020 10:24 IST|Sakshi

లండన్‌: గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్‌లను ఆశ్రయిస్తున్న మహిళలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డ్రైవర్‌ అనుచిత, అసభ్య ప్రవర్తనతో ప్రతిరోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదంటున్నారు బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌. క్యాబ్‌ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచించారు. ‘ లండన్‌లో ఉబెర్‌ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నపుడు నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. దయచేసి... అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లో ప్రయాణం చేయడమే అత్యంత శ్రేయస్కరం. నేనైతే వణికిపోయాను’ అంటూ లండన్‌ క్యాబ్‌ ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. డ్రైవర్‌ తనపై విపరీతంగా అరిచాడని... దాంతో తాను క్యాబ్‌ దిగిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.(చదవండి : ఉబర్‌ యాప్‌లో ఇక ‘నిఘా ఫీచర్‌’)

ఈ క్రమంలో కొందరు సోనమ్‌ ట్వీట్‌కు సానుకూలంగా స్పందించగా... మరికొందరు మాత్రం లండన్‌లో ఉబెర్‌ సేవలపై గతంలో నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. ఉబెర్‌ విషయాన్ని పక్కన పెడితే ప్రైవేటు ట్యాక్సీలు, క్యాబ్‌లలో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదంటూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇక ప్రస్తుతం లండన్‌లో ఉన్న సోనమ్‌.. అక్కడికి బయల్దేరిన క్రమంలో బ్రిటీష్‌​ ఎయిర్‌వేస్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంలో.. సదరు సంస్థ తీరు బాగోలేదని మండిపడ్డారు. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ రెండు సార్లు తన బ్యాగ్‌ పోగొట్టిందని‌.. మరోసారి అందులో ప్రయాణించబోనని ఆమె స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా... క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీల నెట్‌వర్క్‌ కలిగిన ‘ఉబర్‌’ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘వాయిస్‌ ఆడియో రికార్డింగ్‌’ అనే ఫీచర్‌ ద్వారా డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నామని పేర్కొంది. 

మరిన్ని వార్తలు