40 ఏళ్లల్లో ఇదే మొదటిసారి!

15 Apr, 2018 02:01 IST|Sakshi
‘కాలా’లో రజనీకాంత్‌

కొత్త సంవత్సరం అంటే.. చేయాలనుకునే పనుల్లో ‘కొత్త సినిమా’ చూడటం ఒకటి. సినిమా లవర్స్‌ ప్లాన్‌ మోస్ట్‌లీ ఇలానే ఉంటుంది. అయితే ఈసారి తమిళ సినిమా లవర్స్‌కి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే తమిళ సంవత్సరాది (ఏప్రిల్‌ 14)కి కొత్త బొమ్మలేవీ థియేటర్‌కి రాలేదు. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌తో ఆర్థిక లావాదేవీల విషయంలో పొత్తు కుదిరే వరకూ కొత్త సినిమాలు విడుదల చేసేది లేదని తమిళ పరిశ్రమ బలంగా నిర్ణయించుకుంది.

ఆ మేరకు కొత్త సినిమాలేవీ రిలీజ్‌ చేయడంలేదు. స్ట్రైక్‌ మొదలై దాదాపు నెల రోజులు పైనే అయింది. ఇంకా తమిళ పరిశ్రమవారు కొత్త సినిమాలు విడుదల చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గడచిన 40 ఏళ్లల్లో ‘కొత్త సినిమా రిలీజ్‌’ చూడని కొత్త  సంవత్సరాది ఇదేనట. సినీప్రియులకు ఇది బాధగానే ఉంటుంది. మరోవైపు పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు, థియేటర్‌లో సైకిల్‌ స్టాండ్, స్నాక్స్‌ అమ్ముకునేవారి వరకూ... అందరికీ నష్టమే. థియేటర్ల మెయిన్‌టైనెన్స్‌ కోసం పాత తమిళ సినిమాలను ప్రదర్శించుకుంటున్నారు.

వాటికి ఆశించిన కలెక్షన్స్‌ ఉండకపోవచ్చు. ఒకవేళ స్ట్రైక్‌ లేకపోయి ఉంటే.. రజనీకాంత్‌ ‘కాలా’ వచ్చి ఉండేది. ఇక్కడ విడుదలైన ‘మెర్క్యురీ’ అక్కడ రిలీజయ్యుండేది. విశాల్‌ ‘ఇరుంబుదురై’ ఎప్పుడో రిలీజ్‌కి రెడీ అయి, రిలీజ్‌ డేట్‌ దొరక్క ఒకటి రెండు సార్లు, ఇప్పుడు స్ట్రైక్‌ వల్ల తెరపైకి రావడానికి నోచుకోలేదు. ఇప్పటికే ఇండస్ట్రీ 200 కోట్ల వరకూ నష్టపోయిందని చెన్నై వర్గాల అంచనా. మరి.. ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో? కొత్త తమిళ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.
 


                                                       ‘ఇరుంబుదురై’ లో విశాల్, సమంత


                                                                 ‘మెర్క్యురీ’లో ఓ దృశ్యం    
 

మరిన్ని వార్తలు