మంజుల మరణంతో షాక్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమ

24 Jul, 2013 12:14 IST|Sakshi
మంజుల మరణంతో షాక్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమ
 ఆ నవ్వు... పొద్దుతిరుగుడు పువ్వులా ఉంటుంది. 
 ఆ పలువరుస... అందంగా పేర్చిన 
 ముత్యాల హారంలా ఉంటుంది. 
 ఆ ఒంపులు... పాపికొండల మాటున 
 గోదారిలా ఉంటుంది.  
 మొత్తంగా ఆ రూపం... మంచులో తడిసిన 
 మల్లెపువ్వులా ఉంటుంది. ఆమే... మంజుల. 
 
 రెండు దశాబ్దాల పాటు తన సోయగంతో... వెండితెరను ఏలిన నిండు పున్నమి ఆమె. 40 ఏళ్ల క్రితం కుర్రకారు కలలరాణిగా కితాబులందుకున్న మంజుల మంగళవారం అకస్మాత్తుగా కన్నుమూశారు.  నేటి  యువతరానికి మంజుల గురించి అంతగా తెలీకపోవచ్చు. కానీ నాలుగు దశాబ్దాల క్రితం కుర్రకారుకి మాత్రం ఆమె ఓ ఆరాధ్య దేవత. మంజుల గత ప్రాభవాన్ని ఎరిగినవారికి... ‘మంజుల’ అంటే... నేటికీ గుర్తొచ్చేది ఆమె 40 ఏళ్ల నాటి ఆ రూపమే. ఎందుకంటే.. ఆ రూపంతో యువతరం హదయాలపై మంజుల వేసిన ముద్ర అంత గాఢమైంది. 
 
 మంజుల నటించిన సినిమాలన్నీ దాదాపు స్టార్ హీరోలవే. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎమ్జీఆర్, శివాజి గణేశన్, రాజ్‌కుమార్, ప్రేమ్‌నజీర్, శోభన్‌బాబు, కష్ణ, జెమినీగణేశన్.. ఇలా దక్షిణాది స్టార్లందరితోనూ జతకట్టారామె. పెద్ద పెద్ద స్టార్ల పక్కన కథానాయికగా నటించినా.. ప్రతి సినిమాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మంజుల. ఆమె అందాన్ని చూడటానికే థియేటర్లకు వెళ్లిన కుర్రకారు అప్పట్లో ఉండేవారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. 1969లో తమిళంలో వచ్చిన ‘ శాంతినిలయం’ మంజుల తొలి సినిమా.
 
 జెమినీగణేశన్ అందులో కథానాయకుడు. ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించారామె. ఎమ్జీఆర్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘రిక్షాకారన్’ కథానాయికగా మంజుల తొలి సినిమా. ఓ విధంగా ఆ సినిమా నుంచే మంజుల ప్రభ మొదలైంది. తెలుగులో ఆమె తొలి సినిమా ‘జై జవాన్’.1965-1975 ఈ మధ్యకాలం వాణిశ్రీది. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారామె. అలాంటి రోజుల్లో వాణిశ్రీకి గట్టి పోటీనిచ్చారు మంజుల. 
 
 అప్పట్లో వాణిశ్రీ ఫ్యాషన్స్‌ని స్త్రీలు ఎంతగా ఫాలో అయ్యేవారో, మంజుల ఫ్యాషన్స్‌ని కూడా అలాగే ఫాలో అయ్యేవారు. భానుమతి, అంజలీదేవి, సావిత్రి, జమున, వాణిశ్రీ, శారద లాంటి వారిలా గొప్ప గొప్ప పాత్రల్ని మంజుల పోషించలేదనే చెప్పాలి. కానీ పోషించిన ప్రతి పాత్రకూ పూర్తిస్థాయిలో న్యాయం చేసి మంచి నటిగా, అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్నారామె. రెండు దశాబ్దాల పాటు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అందానికి చిరునామాగా నిలిచారు.  వాడేవీడు, పల్లెటూరి చిన్నోడు, మగాడు, నేరం నాదికాదు ఆకలిది, 
 
 మనుషులంతా ఒక్కటే, చాణక్య చంద్రగుప్త, మా ఇద్దరి కథ చిత్రాల్లో ఎన్టీఆర్‌తో జతకట్టిన మంజుల... మరపురాని మనిషి, దొరబాబు, మహాకవి క్షేత్రయ్య, బంగారు బొమ్మలు చిత్రాల్లో అక్కినేనికి జోడీగా నటించారు. అలాగే శోభన్‌బాబుతో  మంచి మనుషులు, పిచ్చిమారాజు, మొనగాడు, జేబుదొంగ, ఇద్దరూ ఇద్దరే, గుణవంతుడు, గడుసు బుల్లోడు చిత్రాల్లో నటించారు. మాయదారి మల్లిగాడు, భలేదొంగలు, మనుషులు చేసిన దొంగలు చిత్రాల్లో కష్ణతో నటించారు.
 
 ఓవరాల్‌గా ఎన్టీఆర్‌తో ఎక్కువ చిత్రాల్లో నటించారు మంజుల. కానీ ఆమెకు పేరు తెచ్చిన సినిమాలు మాత్రం శోభన్‌బాబుతో నటించినవే. వారిద్దరిదీ తెలుగునాట హిట్ పెయిర్. ముఖ్యంగా ‘జేబుదొంగ’ చిత్రంలో శోభన్, మంజులపై చిత్రీకరించిన ‘నీలాల నింగిలో... స్నేహాల తేరులో’ పాట ఇప్పటికీ ఆల్‌టైమ్ హిట్. ఇదే కాదు... మంజుల నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం అన్నీ మ్యూజికల్ హిట్లే కావడం గమనార్హం.  
 
 ‘జీవనగంగ’(1988) చిత్రం నుంచి మంజుల కేరక్టర్ నటిగా కెరీర్ ప్రారంభించారు. వెంకటేష్ ‘ప్రేమ’(1989) చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో రేవతి తల్లిగా యాంటీ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఆ తర్వాత వెంకటేష్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘చంటి’లో కీలక భూమిక పోషించారు. తర్వాత వెంకటేష్ హీరోగా రూపొందిన ‘సరదా బుల్లోడు’ చిత్రంలోనూ నటించారు, తెలుగులో మంజుల నటించిన చివరి సినిమా ‘వాసు’. ఈ సినిమాలో కూడా వెంకటేషే కథానాయకుడు కావడం విశేషం. 
 
 దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించిన మంజుల... తమిళ నటుడు విజయ్‌కుమార్‌ని వివాహం చేసుకున్నారు. మొదటి కుమార్తె వనిత, కోడి రామకష్ణ ‘దేవి’చిత్రంలో కథానాయికగా నటించారు. మిగతా ఇద్దరు కూతుళ్లు కూడా కొన్నాళ్లు ఆర్టిస్టులుగా రాణించారు.తెలుగు తెరపై దేదీప్యమానంగా వెలిగిన అలనాటి తారల్లో ఒకరైన మంజుల మరణం తెలుగు సినిమాకే కాదు... దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకే తీరని లోటు.