షావుకారు జానకి @400

22 Oct, 2019 08:15 IST|Sakshi
చిత్ర యూనిట్‌తో షావుకారు జానకి

సినిమా: 400 చిత్రాలు ఒక గొప్ప సాధన. ఈ సాధనకు అర్హురాలు ఎవరో కాదు షావుకారు జానకినే. తెలుగులో షావుకారు చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే తనదైన ముద్రవేసుకుని షావుకారు జానకీగా ప్రసిద్ధికెక్కారు. ఇక తమిళంలో పార్త జ్ఞాపకం ఇలైయో పాట వింటే ముందుగా జ్ఞాపకం వచ్చేది షావుకారు జానకినే. కోలీవుడ్‌లో వళైయాపతి అనే చిత్రం ద్వారా 1952లో పరిచయం అయిన షావుకారు జానకి ఆపై తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ అంటూ పలు భాషల్లో నటించేస్తూ ఇప్పటికీ నాటౌట్‌గా రాణిస్తున్నారు. ఎంజీఆర్, శివాజీగణేశన్, ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, జెమినీ గణేశన్, నాగేశ్, శ్రీకాంత్, ఏవీఎం రాజన్‌ వంటి ప్రఖ్యాత నటులతో కలిసి నటించిన ఘనత షావుకారు జానకిది. అయితే వీళ్లలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, శ్రీకాంత్‌లతో ఎక్కువ చిత్రాల్లో నటించారు. శివాజీగణేశన్‌కు జంటగా నటించిన పుదియపార్వై చిత్రంలోని పార్త జ్ఞాపకం ఇలైయో అనే పాట నేటికీ అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయ్యింది.

ఆ పాట షావుకారు జానకి చాలా పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే విధంగా జెమినీ గణేశన్‌తో నటించిన భాగ్యలక్ష్మీ చిత్రంలోని మాలై పొళుదిన్‌ మయక్కత్తిలే అనే పాటలో భర్తను కోల్పోయిన భార్యగా తన భావోద్రేకాలను ప్రదర్శించిన విధం అందరినీ ఆకట్టుకుంటుంది. జయలలిత, సరోజాదేవి, కేఆర్‌.విజయ, జయంతీ, వాణీశ్రీ వంటి వారితో పాటు హాస్యనటి సచ్చు వంటి నటీమణులతోనూ నటించి మెప్పించారు. కాగా సినిమాల్లోకి రాక ముందు ఆకాశవాణిలో 300లకు పైగా నాటకాల్లో పాలు పంచుకున్నారు. శ్రీకాంత్‌తో కలిసి పలు నాటకాలు ఆడారు. ఇరు కోడుగళ్‌ చిత్రంలో నటనకు గానూ రాష్ట్రప్రభుత్వ అవార్డును, ఫిలిం ఫేర్, సైమా సంస్థల నుంచి జీవిత సాఫల్య అవార్డులను అందుకున్నారు. అదే విధంగా ఎంజీఆర్‌ అవార్డు, ఆంధ్ర రాష్ట్రం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డుతోనూ గౌరవించబడ్డారు. కమలహాసన్‌తో నటించిన హే రామ్‌ చిత్రం తరువాత 14 ఏళ్లు గ్యాప్‌ తీసుకుని తమిళంలో వానవరాయన్‌ వల్లవరాయన్‌ చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. అప్పుటి నుంచి ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటిస్తున్న షావుకారు జానకీ నాలుగు సెంచరీలు కొట్టారు. అవును ఈ ప్రఖ్యాత నటి తాజాగా ఆర్‌.కన్నన్‌ దర్శకత్వంలో వినోదభరిత పాత్రను పోషిస్తున్నారు. ఇది షావుకారు జానకి నటిస్తున్న 400వ చిత్రం అవుతుంది. సంతానం కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది.

మరిన్ని వార్తలు