ఘంటసాల గానం అజరామరం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

13 Feb, 2020 08:26 IST|Sakshi
ఘంటసాల చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం

నేటికీ... ఏనాటికీ... వన్నె తరగని గాన గంధర్వుని పాటలు

విజయనగర వైభవాన్ని దశదిశలా చాటిచెప్పిన మహనీయుడు

ఆరాధనోత్సవాల ముగింపు వేడుకల్లో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం 

సాక్షి, విజయనగరం : ఘంటసాల గానం అజరామరమనీ... ఆయన నోట జాలువారిన ప్రతీపాట నాటికీ నేటికీ అందరినోట ఎక్కడో ఒక దగ్గర పలుకుతూనే ఉన్నాయనీ ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తెలుగు సంస్కృతిని, ఖ్యాతిని ప్రతిబింబించిన వారిలో ఆదిభట్ల, ద్వారం వెంకటస్వామినాయుడు ఆ తర్వాత స్థానంలో మహనీయుడు ఘంటసాలేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్, కిన్నెర కల్చరల్, ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వహణలో 24 గంటల నిర్విరామ ఘంటసాల ఆరాధనోత్సవాలు ఆనందగజపతి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి ముగిశాయి. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల చిత్రపటం వద్ద ముఖ్యఅతిథి బాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘంటసాల చిరంజీవి అని, ఆయన పాటల ద్వారా మనందరిలోనూ జీవించే ఉన్నాడన్నారు. విజయనగరం కేవలం కళలకు మాత్రమే కాదనీ, పాటల పూదోట ఘంటసాల వంటి మహనీయులు నడయాడిన నేలఅనీ అభివర్ణించారు. నేటితరానికి ఆయన పాటలు, ఆ అక్షరాలను, పదాలను ఎలా పలకాలో, వాటి అర్థాలేంటో తల్లిదండ్రులు, పెద్దలు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. హరిత విజయనగరంగా జిల్లాను తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌.హరిజవహర్‌లాల్‌ను అభినందించారు. తానెప్పుడూ ఘంటసాలను కాలేనని, ఎస్‌పి బాలుగానే ఉండిపోతానన్నారు. కాలానికి తగ్గట్టుగా అనేక మార్పులొస్తాయని, కొన్నింటిని మార్చకూడదని అన్నారు. అమ్మ అమ్మే... అక్షరం అక్షరమే.  ఘంటసాల కూడా అంతేనని తెలిపారు. ఈ గడ్డపై పుట్టిన వారెందరో మహనీయులు చిత్రపరిశ్రమలో మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారన్నారు. విజయనగరం కేవలం కళలకు మాత్రమే కాదని, ఎన్నో విషయాలకు ఇది పుట్టినిల్లు అని కొనియాడారు.  

మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రకార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ.. నిత్యయవ్వనుడు బాలు అని, ఆయన 50ఏళ్లుదాటినప్పటికీ, వందేళ్లకి పైగా ఆయన సంగీత సరస్వతికి సేవలందించాలని కోరారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ.. ప్రవహిస్తున్న పాటల గంగాప్రవాహం ఎస్‌పి బాలు అని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిని దుశ్సాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీబీ పాడిన శివస్తుతి ఆద్యంతం ఆకట్టుకుంది. సంస్ధ ప్రధాన కార్యదర్శి మద్దాళి రఘురామ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రంగస్ధల , టీవీ, సినిమా నటుడు యు.సుబ్బరాయశర్మ,  మేకా కాశీవిశ్వేశ్వరుడు, యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతినిధి రామకృష్ణ,  భీష్మారావు, అధిక సంఖ్యలో సంగీతాభిమానులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు