బాలూకి మాతృ వియోగం

5 Feb, 2019 02:59 IST|Sakshi
తల్లి శకుంతలతో బాలు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతల (89) సోమవారం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు నెల్లూరులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారామె. ఎస్పీబీ తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి ప్రసిద్ధి చెందిన హరికథకుడు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం సమీపంలోని కోనేటమ్మపేట గ్రామానికి చెందిన శకుంతలతో వివాహం అయింది. వారి ప్రథమ సంతానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నెల్లూరు నగరం లోని  తిప్పరాజువారి వీధిలో సాంబమూర్తి దంపతులు ఒక ఇంటిని కొనుక్కున్నారు. అక్కడే ఈ దంపతుల సంతానం బాలుతోపాటు గిరిజ, పార్వతి, జగదీష్, శైలజ, వసంతలక్ష్మి పెరిగి పెద్దవారయ్యారు. శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి భిక్షాటనాపూర్వక త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించేవారు. ఆ పరంపర ఇప్పటికీ నెల్లూరులో కొనసాగుతోంది.

ఇంటిపై మమకారం
సంతానం అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సాధించినప్పటికీ తాను ఉన్న ఇంటి పైనే శకుంతలకు మమకారం ఎక్కువ. భర్త మరణించి దాదాపు 40 ఏళ్లు అయినా ఆమె ఆ ఇంటిని వదలలేదు. భర్త కష్టార్జితం కావడం, జీవితంలో అన్ని ఘట్టాలతో పెనవేసుకున్న గృహం కావడంతో ఆమెకు ఆ  ఇల్లంటే ప్రాణం. తండ్రి మరణానంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన దగ్గర చెన్నైలో ఉండాలని కోరినా ఆమె ఒప్పుకోలేదు. తన జ్ఞాపకాలను, తన ఇంటిని దూరం చేయొద్దని బాలును ఒప్పించారామె.

చేసేదేం లేక బాలు ఆమె కోసం ఒక కుటుంబాన్ని ఆమె వద్ద ఉంచి ఆమె ఆలనాపాలనా బాధ్యతలు చూసేలా చేశారు. ఓ సంగీత కచేరి నిమిత్తం లండన్‌ వెళ్లిన బాలు తల్లి మరణవార్త తెలియగానే ఇండియా బయలుదేరారు. శకుంతలమ్మ అంతిమ యాత్ర స్వస్థలమైన నెల్లూరులో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, తమ సంప్రదాయంలో భాగంగా నెల్లూరు బోడిగాడి తోటలో ఖననం చేయనున్నామని బంధుమిత్రులు తెలిపారు.      
– సాక్షి, నెల్లూరు
 

మరిన్ని వార్తలు