ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

21 Aug, 2019 02:10 IST|Sakshi
ఎస్పీ చరణ్, బాలసుబ్రహ్మణ్యం

– ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

‘‘నేను, అన్నయ్య ఏసుదాస్, చిత్ర ముగ్గురం కలిపి అన్ని భాషల్లో దాదాపు లక్ష పాటల వరకు పాడితే అందులో తెలుగు పాటలే 35,000 వరకూ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అలేఖ్య హోమ్స్‌ సమర్పణలో ఎలెవన్‌ పాయింట్‌ టూ ప్రొడక్షన్స్‌ వారు ‘లెజెండ్స్‌’ సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్‌ 30న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా ఎస్‌.పి.

బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌లో పాటలు ఎక్కువ, మాటలు తక్కువగా ఉంటాయి. గతంలో ఇలాంటి ప్రోగ్రామ్‌ జరగలేదు. మహ్మద్‌ రఫీ, కిషోర్‌ కుమార్, లతా మంగేష్కర్‌లు ఎక్కడా కలిసి ప్రోగ్రామ్‌లు చేయలేదు. వాళ్లతో పోల్చుకునేంత పెద్దవాళ్లం కాకపోవచ్చు కానీ, స్కేల్‌ కోసం చెప్తున్నాను. మూడు గంటల్లో ముగ్గురం 30 లేదా 35 పాటలు పాడతాం. మన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే టాలెంటెడ్‌ మ్యుజీషియన్స్‌తో పాటు రెహమాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ నుంచి సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా పిల్లలు కూడా మా బృందంలో ఉంటారు. రెహమాన్‌ దగ్గర ఉన్న శ్రీనివాసమూర్తి కూడా భాగమవుతున్నారు’’ అన్నారు.

పాటలపై రాయల్టీ విషయంలో మీరు, ఇళయరాజా కొంత కాలం మాట్లాడుకోలేదు. ఇప్పుడు కలుసుకున్నారు. మీరు మళ్లీ ఎలా కలుసుకున్నారు? అని అడిగితే – ‘‘నేనెప్పుడూ ఆయన సంగీతంలో పాడనని చెప్పలేదు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లటానికి తయారుగా ఉన్నాను. ఆయన పిలిచారు, నేను వెళ్లాను. రిహార్సల్స్‌కి వెళ్లినప్పుడు ఏరా.. ఎలా ఉన్నావు? అంటే బావున్నాను, అంటే బావున్నాను అని ఇద్దరం అనుకున్నాం. ‘ఒకసారి ఇలా రా. చాలా రోజులైంది కౌగిలించుకొని’ అన్నారు. ఇద్దరం కౌగిలించుకున్నాం. అంతటితో అయిపోయింది.

గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. ఈ మధ్య రెండు ప్రోగ్రామ్‌లు కలిసి చేశాం. కోయంబత్తుర్‌లో ఓ ప్రోగ్రామ్, వచ్చే ఆదివారం తిరుచునాపల్లిలో ఓ ప్రోగ్రామ్‌ చేస్తున్నాం. అలాగే వచ్చే ఏడాది మార్చిలో 6 వారాల పాటు అమెరికాలో ప్రోగ్రామ్‌లు ఇవ్వనున్నాం. ఆయన అయితే నాతో ప్రోగ్రామ్‌లు చేయటానికి ఫిబ్రవరి వరకు డేట్స్‌ అడుగుతున్నారు కానీ, ఖాళీగా లేవు. ఇంట్లో వాళ్ల మధ్య ఎప్పుడైనా పొరపొచ్ఛాలు రావచ్చు. ఇద్దరి మనస్తత్వాలను బట్టి ఆ సమస్యను పరిష్కరించుకోవటం చాలా ఈజీ.

పట్టుదలలు, పంతాలు ఉంటే చాలా కష్టం. తెగేదాకా ఏదీ లాగకూడదు. ఇద్దరికీ కలిసి పని చేయాలని కోరిక ఉంది కాబట్టి మాకు ఈజీ అయింది. అయినా ఇది వేరే ఒక ఇష్యూ మీద వచ్చిన సమస్య తప్ప వ్యక్తిగతమైనది కాదు. ఎందుకంటే నా పాట అంటే ఆయనకి ఇష్టం, ఆయన సంగీతమంటే నాకు బహు ఇష్టం. ఆ కాంబినేషన్‌ కావాలని సంగీత ప్రియులంతా ఎదురు చూస్తుంటే అది జరిగింది. అంతకంటే ఏం కావాలి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలు తనయుడు, గాయకుడు ఎస్‌.పి చరణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు