రాయల్టీ వస్తే ఎప్పుడో రిటైర్‌ అయ్యేవాడిని: ఎస్పీ బాలు

8 Aug, 2018 19:18 IST|Sakshi
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : రాయల్టీ చట్టంపై గాయనీ గాయకులంతా అవగాహన కలిగివుండాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోరారు. పాటలపై నిర్మాత, సంగీత దర్శకుడు, గేయ రచయితలకు మాత్రమే హక్కులు ఉన్నాయని చెప్పారు. కేవలం లతా మంగేష్కర్‌ మాత్రమే ఒప్పందంలో రాయల్టీ కుదుర్చుకునేవారని వివరించారు. కానీ, 2012లో వచ్చిన రాయల్టీ చట్టం గాయనీ గాయకులు అందరికీ పాటలపై హక్కులు కల్పిస్తోందని వెల్లడించారు. ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌(ఇశ్రా) సమావేశంలో బుధవారం ఈ చట్టంపై చర్చించారు. అనంతరం ఎస్పీ బాలు మీడియాతో మాట్లాడారు.

గాయనీ గాయకులంతా ఐక్యమై రాయల్టీని తీసుకోవాలని కోరారు. సినిమా పాటలకు సంబంధించి నాకు ఒక్క రూపాయి రాయల్టీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పాటలకు రాయల్టీ చెల్లిస్తే ఎప్పుడో రిటైర్ట్ అయ్యేవాడినని అన్నారు. రాయల్టీ చట్టం ప్రకారం పాట లాభాల్లో గాయనీ గాయకుల నాణ్యమైన వాటా చెల్లించాలని చెప్పారు. రాయల్టీ యాక్టు కాపీ రైట్ యాక్టులా తయారైందని వివరించారు.

దాదాపు 410 మంది సింగర్‌లు ఇశ్రాలో ఉన్నట్లు చెప్పారు. రాయల్టీ అనేది కేవలం సినిమా పాటలకే కాకుండా అన్ని రకాల పాటలకు వర్తిస్తుందని వెల్లడించారు. ఒక పాటను రీ-మిక్స్ చేయాలంటే ఐపీఆర్‌ఎస్‌ నుంచి పర్మిషన్‌ తీసుకోని చేయాలని తెలిపారు. లేకపోతే దానిపై లీగల్‌గా ముందుకెళ్తామని పేర్కొన్నారు. మైనెస్ 1 ట్రాక్ పాడినా.. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనుమతి తీసుకోవాలని చెప్పారు. చనిపోయిన సింగర్లు పాడిన పాటలకు కూడా రాయల్టీ వస్తుందని తెలిపారు. అయితే, ఇందుకు సదరు సింగర్‌ కుటుంబ సభ్యులు ఇశ్రాలో సభ్యులు అయి ఉండాలని చెప్పారు.

మరిన్ని వార్తలు