అదే పెద్ద విక్టరీ అనుకుంటున్నా: దీప్తి

3 Oct, 2018 01:43 IST|Sakshi

ఫైనలిస్ట్‌

‘బిగ్‌బాస్‌ 2’లో మీ ఎక్స్‌పీరియన్స్‌ ఏంటి? ఇన్ని రోజులు ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాననే బాధ అనిపించిందా? కచ్చితంగా బాధగానే ఉంది. దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసే ‘బిగ్‌బాస్‌ 2’లో  అడుగుపెట్టాను. మా అమ్మ, భర్త శ్రీకాంత్, కొడుకు సిద్ధార్థ్‌.. ఇలా మా కుటుంబ సభ్యులందరి సపోర్ట్‌తో బిగ్‌బాస్‌కి వెళ్లగలిగాను. జనరల్‌గా అమ్మాయిలకు పెళ్లయితే కొన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ, నాకు అలాంటివేం పెట్టలేదు. ఇంత మంచి ఫ్యామిలీ ఎక్కడా ఉండదు. నాకు బాధ అనిపించినప్పుడల్లా వారి మాటలు నన్ను చాలా మోటివేట్‌ చేశాయి. ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని గట్టిగా ఉన్నా. మా కుటుంబ సభ్యులను చూశాక కన్నీళ్లు ఆగలేదు. నాకే కాదు. బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ అందరి పరిస్థితి ఇంతే. వందరోజుల్లో కనీసం నాపేరు 100 సార్లైనా తలచుకున్నావా? అని మా అబ్బాయి సిద్ధార్థ్‌ అడిగాడు.100కంటే ఎక్కువ సార్లు తలచుకున్నా.

మీరెందుకు గెలవలేకపోయారు?
ఏ ఆటలో అయినా విజేత అనేవాడు ఒక్కడే ఉంటాడు. షో నుంచి బయటికొచ్చాక చాలా మంది నన్ను కలిసి ‘విజేతగా మిమ్మల్ని కూడా మేము ఊహించుకున్నాం. కనీసం రన్నరప్‌లో అయినా ఉంటారనుకున్నాం’ అంటుంటే వారి మనసులను గెలుచుకున్నామనే హ్యాపీ ఉంది. ఆట ఆడటానికొచ్చినప్పుడు గెలిచినా.. ఓడినా, ఎలిమినేట్‌ అయినా స్పోర్టివ్‌గా ఉండాలనుకున్నా, ఉన్నాను. గెలవాలనే తాపత్రయం మా 17 మందిలో ఉండేది. కౌశల్‌ కూడా మాలో ఒక్కడే కదా? తను గెలిస్తే ఏంటి? సంతోషమే కదా? 

‘బిగ్‌బాస్‌ 1’లో శివబాలాజీ విజేతగా నిలిచారు. ‘బిగ్‌బాస్‌ 2’లో  కౌశల్‌ గెలిచారు. రెండు సీజన్స్‌లోనూ అబ్బాయిలే గెలిచారు. అమ్మాయిలను అణిచేశారనే భావన ఏమైనా ఉందా?
అలాంటి ఫీలింగ్‌ ఎప్పుడూ కలగలేదు. ‘బిగ్‌బాస్‌’ టాస్క్‌లు ఇచ్చేటప్పుడు అబ్బాయిలకు ఒకలా.. అమ్మాయిలకు మరోలా ఇవ్వలేదు కదా? అందరికీ ఒకే టాస్క్‌లు ఇచ్చారు. ఎవరైనా ఒక్కటే అని ప్రేక్షకులు కూడా ఆటని ఆటలా చూశారు. అందుకే కదా ఫైనల్‌ వరకూ వెళ్లా. విజేత ఎవరన్నది చివరకు ప్రేక్షకులే నిర్ణయించారు. 

కౌశల్‌ ఎందుకు గెలిచారనుకుంటున్నారు?
గేమ్‌ పరంగా ఆయన ఫోకస్‌ ప్లస్‌ అయింది. ఆయన గెలవడానికి అన్ని  కారణాలు కలిసొచ్చాయి. అన్ని వర్గాలు ఆయన విజయానికి హెల్ప్‌ అయ్యాయి. 

కౌశల్‌ గెలవడానికి పూర్తి అర్హత ఉందని  మీ నమ్మకమా?
‘బిగ్‌బాస్‌ 2’లో పాల్గొన్న 17 మందికి గెలిచే అర్హత ఉంది. అయితే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలించవు.. మరికొన్ని సార్లు అనుకూలిస్తాయి. 

‘బిగ్‌బాస్‌ 2’లో పాల్గొన్నందుకు ఏమైనా అసంతృప్తి ఉందా?
లేదు. ప్రతి టాస్క్‌లో నేను ఎంత బెస్ట్‌ ఇవ్వగలనో అంత ఇచ్చాను. అందరితో మంచి స్నేహం కుదిరింది. గీతామాధురి అక్కతో కలిసి ఒకటో రెండో షోలు చేశా. ఓ రోజు విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్‌లో ట్రావెల్‌ చేస్తున్నప్పుడు క్యాజువల్‌గా మాట్లాడాను. గీత అక్కతో తప్ప షోలో పాల్గొన్నవారిలో ఎవరితోనూ కనీసం ముఖ పరిచయం కూడా లేదు. నేనూ, గణేశ్‌ ఇంచుమించు ఒక్కటే అని చెప్పొచ్చు. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా అంతవరకూ వెళ్లి ఫైనల్‌ వరకూ నిలవడమే ఓ విక్టరీగా భావిస్తున్నా. 

మరిన్ని వార్తలు