అది శాపం...  వరం  కూడా!

14 Nov, 2018 00:00 IST|Sakshi

‘‘నా కెరీర్‌లో ఏం జరిగినా అది నా బాధ్యతే. మంచైనా.. చెడైనా. నాది సింపుల్‌ లివింగ్‌ స్టైల్‌. సినిమా అంటే నాకు పిచ్చి ఉంది కానీ కీర్తి కాంక్ష లేదు. సక్సెస్‌ వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లు ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు లేరే అని బాధపడే మనస్తత్వం కాదు నాది. ఇప్పటివరకు నాతో సినిమా చేయమని ఏ హీరోను, ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టలేదు’’ అన్నారు శ్రీను వైట్ల. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’. ఇలియానా కథానాయికగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు.

‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ ఒక పాయింట్‌ బేస్డ్‌ సినిమా. అందుకే ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. రవితేజతో నేను చేసిన ‘నీ కోసం, వెంకీ, దుబాయ్‌ శీను’ సినిమాల్లో లేనటువంటి బలమైన కథ ఈ సినిమాలో బోనస్‌గా ఉంటుంది. మేజర్‌ షూటింగ్‌ న్యూయార్క్‌లో చేశాం. నన్ను, కథను అర్థం చేసుకుని ప్రొడ్యూసర్స్‌ బాగా సపోర్ట్‌ చేశారు. మూవీ జర్నీ బాగుంటే ఫలితం బాగుంటుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాను చాలా లగ్జరీగా తీశాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఏ సినిమాకు బడ్జెట్‌ హద్దులు దాటలేదు. నిర్మాతలు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని బడ్జెట్‌ను పెంచే మనస్తత్వం నాది కాదు.
 

రవితేజ మంచి పొటెన్షియల్‌ అండ్‌ ఇంటెన్స్‌ యాక్టర్‌. ఆయనకు సినిమాలంటే పిచ్చి. నాలోని డైరెక్టర్‌ని రవితేజ బాగా నమ్ముతారు. ఇంతకుముందు ఉన్న కమిట్స్‌మెంట్స్‌ కారణంగానే రవితో మళ్లీ సినిమా చేయడానికి ఇంత టైమ్‌ పట్టింది. ఇలియానాను కథానాయికగా తీసుకోవాలనుకునే ఆలోచన నాదే. సునీల్‌ మంచి క్యారెక్టర్‌ చేశారు. రవితేజ చిన్నప్పటి పాత్రకు ముందుగా ఆయన కుమారుడు మహాధన్‌ను అనుకున్నాం కానీ వర్క్‌ పర్మిట్‌ లేట్‌ అవ్వడం వల్ల కుదర్లేదు. అలాగే లయగారు, అభిరామిగారు బాగా చేశారు. కథకు కరెక్ట్‌గా సరిపోతుందనే ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ టైటిల్‌ పెట్టాం. సినిమాలో రివెంజ్‌ బ్యాక్‌డ్రాప్‌ ఒక పార్ట్‌ మాత్రమే. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్స్‌ ఆలస్యం అవడం వల్ల సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ‘తానా’ మీద ఈ సినిమాలో సెటైర్స్‌ వేయలేదు.

తప్పుల నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అనే మాట నిజం. నేర్చుకోకపోతే అక్కడే ఉండిపోతాం. ఎక్కడ తప్పు జరుగుతుందనే విషయంపై రియలైజ్‌ అయ్యాను. నేను సక్సెస్‌లో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ సినిమా కోసం అంతకు మించి పని చేశాను. నేను ‘డౌన్‌’లో ఉన్నప్పుడు కూడా ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ సినిమా కోసం ఐదుగురు ప్రొడ్యూసర్స్‌ పోటీ పడ్డారు. మైత్రీని చూజ్‌ చేసుకున్నాం.
 

చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేదు. చిన్న సినిమాల నుంచే పెద్ద డైరెక్టర్‌గా ఎదిగాను. నా తొలి సినిమా బడ్జెట్‌ 38 లక్షలు. కెరీర్‌లో ఎవరికైనా ఎత్తుపల్లాలు ఉంటాయి. నాకు కానీ, కొంతమంది డైరెక్టర్స్‌ కానీ ఒక బ్రాండ్‌ వచ్చింది. అదే శాపం, వరం కూడా.  కొత్త కథను చెప్పడం కష్టం కాదు. అందులో నా మార్క్‌ మిస్‌ అవ్వకుండా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడం చాలా కష్టమైన విషయం. ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మహేశ్, నేను సినిమా చేయాలనుకుంటే చేస్తాం.

నెక్ట్స్‌ ఇంకా ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్స్‌ రెడీ చేస్తున్నాను. బాలీవుడ్‌లో సినిమాలు చేయాలని నాకూ ఉంది. ‘ఢీ, దూకుడు’ సినిమాలను బాలీవుడ్‌లో చేయాల్సింది. కుదర్లేదు. ఈ సినిమాతో కుదురుతుందేమో చూడాలి. 

మరిన్ని వార్తలు