నో డౌట్‌.. చాలా  నమ్మకంగా ఉన్నాను

24 Feb, 2019 01:17 IST|Sakshi

‘‘హరేరామ్‌’ లాంటి డిఫరెంట్‌ మూవీని పదేళ్ల క్రితమే ట్రై చేశాం. కొత్త తరహా సినిమాలు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నాను. ‘118’ కథ వినగానే చాలా నచ్చింది. నా బ్యానర్‌లో చేద్దామనుకున్నాను. దర్శకుడు కేవీ గుహన్‌ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకొని కథ తయారు చేశారు. నో డౌట్‌.. ఈ సినిమా సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’’ అని కల్యాణ్‌రామ్‌ అన్నారు. కెమెరామేన్‌ గుహన్‌ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతూ, కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘118’. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్‌ యస్‌ కోనేరు నిర్మాత. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌ పలు విశేషాలు పంచుకున్నారు. 

ఫస్ట్‌ టైమ్‌ పూర్తి స్థాయి థ్రిల్లర్‌లో నటించాను. ట్రైలర్‌లోనే సినిమా కథంతా చూపించాం. ట్రైలర్‌ని మూడు నాలుగుసార్లు చూస్తే కథ అర్థం అవుతుంది. ట్రైలర్‌ బావుందని మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేని పూర్తి స్థాయి కమర్షియల్‌ సినిమా ఇది. కామెడీ కానీ, కమర్షియల్‌ సాంగ్స్‌ కానీ ఏవీ కావాలని పెట్టినట్లుగా ఉండవు.

గుహన్‌గారి లైఫ్‌లో ఒక సంఘటన రిపీటెడ్‌గా జరిగింది. దీన్నే కథగా ఎంచుకొని హీరో దాన్ని ఛేదించుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? అనే అంశంతో స్క్రిప్ట్‌ తయారు చేశారు. మొదట చాలా టైటిల్స్‌ అనుకున్నాం ‘రక్షణ, అన్వేషణ’ ఇలా.. అయితే కొత్తగా, డిఫరెంట్‌గా ఉండాలని ‘118’ ఫిక్స్‌ చేశాం. ఈ సినిమాకు మెయిన్‌ హైలైట్‌ స్క్రీన్‌ప్లే. పరిగెడుతుంది. హీరో కూడా ప్రేక్షకుడిలానే ఉంటాడు. ప్రేక్షకులకు, హీరోకు సర్‌ప్రైజ్‌లు ఒకేసారి తెలుస్తుంటాయి. 

ఈ సినిమా కోసం లుక్‌ మార్చానంటున్నారు. మరీ రొటీన్‌గా ఉంటే ప్రేక్షకులు కూడా రొటీన్‌ ఫీల్‌ అవుతారు. ‘ఇజం’ నుంచి కొత్త లుక్‌ ట్రై చేస్తూ వస్తున్నా. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ పాత్ర నాది. మొదట ఈ క్యారెక్టర్‌లోకి వెళ్లడానికి కొంచెం టైమ్‌ పట్టింది. 

ప్రొడక్షన్‌లో  నిర్మాత మహేశ్‌ కోనేరు కాంప్రమైజ్‌ కాలేదు. అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ కూడా ముంబై వెళ్లి మరీ షూట్‌ చేశాం. నాకు ఈత రాదు. నేర్చుకొని మరీ చేశా. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాను. చివరి 30 నిమిషాలు సినిమాకే హైలైట్‌. విజువల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. గుహన్‌గారు లేకపోతే ఈ సినిమా ఇలా ఉండేది కాదని నమ్మకంగా చెబుతున్నాను. 

నివేదా థామస్‌ ఎమోషనల్‌ సీన్స్‌ బాగా చేయగలుగుతారు. ఈ పాత్రకు ఫస్ట్‌ ఆప్షన్‌ ఆమె. షాలినీ పాండే కూడా  బాగా చేశారు.  హిట్, ఫ్లాప్స్‌ ఎఫెక్ట్‌ కచ్చితంగా మా మీద ఉంటుంది. ఫ్లాప్‌ సినిమాకి బాధపడతాం. ఆ తర్వాత సినిమా వైఫల్యానికి కారణాలేంటో లెక్కలేసుకొని రిపీట్‌ కాకుండా చూసుకుంటాం. ఇది ట్రై అండ్‌ ట్రై ప్రాసెస్‌ అంతే. 

వరుస హిట్స్‌ సాధించాలని ఏ నటుడికైనా ఉంటుంది. మంచి సినిమా ఆడియన్స్‌కు ఇద్దాం అనుకునే సినిమాలు తీస్తాం. రిజల్ట్‌ మన చేతుల్లో ఉండదు. మనం మళ్లీ హిట్‌ సాధిస్తాం అనే నమ్మకంతో నిర్మాతలు, దర్శకులు సినిమాలు తీస్తూనే ఉంటారు. 
     
ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ స్థాపించడం వెనక ఉన్న ముఖ్యోద్దేశం మంచి సినిమాలు తీయడమే. ‘ఇంత చెత్త సినిమా తీశాడేంట్రా’ అని ప్రేక్షకుడు అనుకోకూడదు. మా బ్యానర్‌లో పరిచయమైన సురేందర్‌రెడ్డి, అనిల్‌ రావిపూడి మంచి హిట్స్‌ సాధించడం హ్యాపీగా ఉంది. కొన్ని కథలు విన్నాను. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత నెక్స్‌ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేస్తాను. మా బ్యానర్‌పై వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నాం. టీనేజ్‌ లవ్‌స్టోరీతో ఆ సిరీస్‌ సాగుతుంది.

ఇదివరకు సినిమా రిలీజైన 6 నెలలకు టీవీలో వచ్చేది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల నెల రోజులకే అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేస్తున్నాయి. కనీసం ఓ 2 నెలలు అయినా ఆగితే బావుంటుందన్నది నా అభిప్రాయం. సినిమా వంద రోజులాడే రోజులు పోయాయి. నాలుగు వారాలాడితే సూపర్‌హిట్‌.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు