సమంత ఎందుకు ఒప్పుకుందో... చైతూ చూడనని చెప్పేశాడు!

4 Oct, 2017 00:10 IST|Sakshi

నాగార్జున మీసాలు తీసేసి కొత్తగా కనిపిస్తున్నారు. ఏదైనా సినిమా కోసమా? అనడిగితే..  ‘‘నో నో. కొత్తగా ప్రయత్నించాలనుకున్నా. వచ్చే మూడు నెలలు షూటింగులేవీ లేవు. ఈ ఏడాదంతా ఖాళీ. అమ్మాయిలందరూ ఈ లుక్‌ను ఇష్టపడుతున్నారు’’ అని నాగార్జున అన్నారు. ఓంకార్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమా ‘రాజుగారి గది–2’. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇంకొకటి... నాగచైతన్య, సమంతల పెళ్లి ఎల్లుండే. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు....

నా మనసులో ఉన్నది చెప్పేశాడు!
‘రాజుగారి గది–2’లో మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌ చేశా. కొత్తగా ఉందీ పాత్ర. నాకు హీరోయిన్‌ లేదు, రొమాంటిక్‌ సీన్స్‌ లేవు, పాటల్లేవ్‌! ఈ సినిమా అంగీకరించిన తర్వాత... ఓ రియల్‌ మెంటలిస్ట్‌ని కలిశా. జస్ట్‌... ఐదారు ప్రశ్నలు అడిగాడంతే. మూడుసార్లు నేను మనసులో అనుకున్న పదాల్ని చెప్పేశాడు. నాకు ఆశ్చర్యంగా అన్పించింది. మర్డర్‌ మిస్టరీలు, వాటిని సాల్వ్‌ చేసే క్యారెక్టర్‌లో నేను కనిపిస్తా. ఓ ఆత్మ ఈలోకాన్ని ఎందుకు విడిచి వెళ్లలేదు. దాంతో నా కనెక్షన్‌ ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఆత్మకీ, నాకూ చాలా హ్యూమన్‌ రిలేషన్స్‌ ఉంటాయి.
     
గ్రాఫిక్స్‌ వల్లే  ఆలస్యమైంది!
సిన్మా చాలా బాగుంది. సెప్టెంబర్‌ 1న చూద్దామనుకున్నా. కానీ, అక్టోబర్‌ 2న చూశా. ఓ నెల ఆలస్యమైంది. సెప్టెంబర్‌ 1న ఎడిటెడ్‌ వెర్షన్‌ చేతికొచ్చింది. అయితే స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ బాగోలేవు. అప్పుడు నేను డబ్బింగ్‌ చెప్పనన్నాను. డబ్బింగ్‌ చెబితే... అలాగే విడుదల చేసేస్తారు. నేను ప్రెజర్‌ పెట్టేసరికి మళ్లీ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చేసుకొచ్చారు. ఆత్మలతో ముడిపడిన కథ కదా! ఆత్మ నేపథ్యంలో వచ్చిన ప్రతి సన్నివేశంలోనూ గ్రాఫిక్స్‌ అవసరమే. అందువల్ల, సినిమా అంతా వీఎఫ్‌ఎక్స్‌కి ప్రాముఖ్యత ఉంది. గ్రాఫిక్స్‌ బాగోలేకపోతే... ప్రేక్షకులకు భయం వేయదు. వెంటనే డిస్‌కనెక్ట్‌ అవుతారు.
     
‘ఆనందో బ్రహ్మా’ చూశారుగా!
నేను ఫస్ట్‌ టైమ్‌ హారర్‌ సిన్మా చేశా. హారర్‌ సిన్మాలు అవుట్‌డేటెడ్‌ అవుతున్నాయనుకోవడం లేదు. మొన్నే ‘ఆనందో బ్రహ్మ’ బ్రహ్మాండంగా ఆడింది కదా! మలయాళ ‘ప్రేతమ్‌’ కథను స్ఫూర్తిగా తీసుకుని, సీన్లు మార్చి ఓంకార్‌ కొత్త కథ రాశాడు. నా క్యారెక్టరైజేషన్‌ కూడా కొత్తగా ఉంటుంది. హారర్‌ కంటే ఈ సినిమాలో థ్రిల్‌ ఎక్కువ ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్‌ మంచి కామెడీ చేశారు. ఏమాత్రం వల్గారిటీ లేకుండా చేశాం. ఫ్యామిలీ అంతా చూసేలా తీశాం. ‘మనం’ చూశాక, ప్రేక్షకుల్లో ఎలాగయితే ఓ మంచి ఫీలింగ్‌ కలిగిందో! ఈ సినిమా చూశాక కూడా అలాంటి ఫీలింగ్‌ తప్పకుండా కలుగుతుంది.

సమంతను అలా చూడలేను!
‘రాజుగారి గది–2’లో సమంత దెయ్యంగా చేస్తున్నారు కదా? అని అడగ్గా... నా కోడల్ని దెయ్యంగా చూడలేను, చూడాలనుకోవడం లేదు. (నవ్వుతూ...) సమంతతో ‘నో... నువ్వెందుకు ఒప్పుకున్నావ్‌?’ అనడిగా. చైతూతో సినిమా చూస్తే... ‘మీరిద్దరూ ఓ గదిలో ఎలా ఉంటారో’ అన్నా. వాడైతే నేను సినిమా చూడనని చెప్పేశాడు. సమంత క్యారెక్టర్‌ ముందు నుంచి ఉంటుంది. కానీ, క్లైమాక్స్‌లో అద్భుతంగా నటించింది.

చైతూ పెళ్లికి అతిథులు... మూడు కుటుంబాలే!
రామానాయుడిగారి ఫ్యామిలీ, మా (అక్కినేని) ఫ్యామిలీ, సమంత ఫ్యామిలీ... చైతూ పెళ్లికి మొత్తంగా చూస్తే అతిథులు వందమంది లోపే. జస్ట్‌... మా ఫ్యామిలీలు, ఇమీడియెట్‌ ఫ్యామిలీలను ఇన్వైట్‌ చేశాం. అందర్నీ పిలవాలనుంది. కానీ, ఒకర్ని పిలిచి మరొకర్ని మర్చిపోతే ఇబ్బంది. అందరూ కావలసినవాళ్లే. అందువల్లే, రిసెప్షన్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా చేద్దామని నిర్ణయించుకున్నా. మోస్ట్‌ సింపుల్‌ వెడ్డింగ్‌. బట్, భోజనాలు మాత్రం బాగుంటాయి. (నవ్వులు) రిసెప్షన్‌ ఎందుకు? వద్దని చైతూ అన్నాడు. కుదరదని చెప్పా. రిసెప్షన్‌కి ఇంకా డేట్‌ ఏదీ అనుకోలేదు. పెళ్ళైన వారం రోజుల తర్వాత ఇద్దరూ షూటింగులకు వెళ్తున్నారు. అక్టోబర్‌ 15 నుంచి కాల్‌షీట్స్‌ ఇచ్చేశారు. ఈ మధ్యలో మంచి డేట్‌ చూసి ఎన్‌ కన్వెన్షన్‌లో రిసెప్షన్‌ ప్లాన్‌ చేస్తున్నా.

మా పెళ్లి గుర్తొచ్చింది!
గోవాలో అక్టోబర్‌ 6న హిందూ, 7న క్రిస్టియన్‌ పద్ధతుల్లో చైతూ, సమంతల పెళ్లి! చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే... రెండు సంప్రదాయాలను గౌరవించి రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం! ఐయామ్‌ వెరీ హ్యాపీ. ఓ పెళ్లికి పంచె కట్టుకోవచ్చు... ఇంకో పెళ్లికి సూట్‌ వేసుకోవచ్చు! ఎప్పట్నుంచో ‘అమ్మాయిలను మీరు చూసుకోండి. పెళ్లి మాత్రం మన ఇంట్లో నేనే చేస్తా’ అని చైతూ, అఖిల్‌కు చెప్పేవాణ్ణి. చక్కగా కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేయాలనుకునేవాణ్ణి. ఇప్పుడు చైతూ, సమంత అలాగే చేసుకోవాలనుకోవడం నాకు నచ్చింది. ముఖ్యంగా... ఆర్యసమాజ్‌లో జరిగే పెళ్లిలకు ప్రతి శ్లోకానికి, మంత్రానికి మన ఘంటశాలగారు భగవద్గీత చదివినట్టు... చక్కగా అర్థాలు చెబుతారు. అప్పట్లో అమల, నేనూ కావాలనే ఆర్యసమాజ్‌లో చేసుకున్నాం. నాకింకా ఆ రోజులు గుర్తున్నాయ్‌! పురోహితులు చెప్పినట్టు చేసేసి, ఓ అర్ధగంటలో పెళ్లి తంతు ముగించకుండా, మంత్రాలకు అర్థాలేంటో తెలుసుకోమని చైతూకి, సామ్‌కి చెప్పా.

హలో... డిసెంబర్‌ 22నే!
విక్రమ్‌ (దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌) కథ చెప్పిన తర్వాత... అతనితో ‘నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అనుకున్న దానికన్నా బాగా తీస్తావ్‌’ అన్నాను. కానీ, సమస్య ఏంటంటే... బాగా చెక్కుతాడు. అది మంచిదే. ఓ సినిమాకి అలాంటి దర్శకుడు కావాలి. అఖిల్‌ వయసుకి సరైన సినిమా. ఓ అందమైన ప్రేమకథ. అక్టోబర్‌ 15కి షూటింగ్‌ పూర్తి చేస్తానని విక్రమ్‌ ప్రామిస్‌ చేశాడు. వర్షాల వల్ల ఓ వారం ఆలస్యం కావొచ్చు! డిసెంబర్‌ 22న విడుదల చేస్తాం. ఆల్రెడీ థియేటర్లకు చెప్పేశాం. అందువల్ల, విక్రమ్‌పై ప్రెజర్‌ పెడుతున్నా. డిసెంబర్‌ దాటితే మళ్లీ పండక్కి చాలా సినిమాలు వస్తున్నాయి. ప్రతిరోజూ విక్రమ్‌కి ఫోన్‌ చేసి... షూటింగ్, ఎడిటింగ్, రీ–రికార్డింగ్‌ పనులు ఎంతవరకూ వచ్చాయో కనుకుంటున్నా!
     
అభిమానిగా కాదు... దర్శకుడిగా తీయాలి!
చందూ (దర్శకుడు చందూ మొండేటి) నాకు పెద్ద ఫ్యాన్‌. అతనితో తప్పకుండా సినిమా చేస్తా. అయితే... అభిమానిగా కాదు, దర్శకుడిగా సినిమా తీయమని చెప్పా. (నవ్వుతూ...) అభిమానిగా తీస్తే (సినిమాని) ఎవరూ చూడరు! గతంలో పోలీస్‌ నేపథ్యంలో నాకో కథ చెప్పాడు. చైతూతో తీయబోయే ‘సవ్యసాచి’ కథనూ చెప్పాడు. అద్భుతంగా ఉందది.
     
నాన్నగారి కల... అందుకని డబ్బు గురించి ఆలోచించడం లేదు.
అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌తో ఈ ఏడాది ఓ సినిమా తీస్తాం! యాక్టర్స్, టెక్నిషియన్స్, సిన్మా టీమ్‌ అంతా స్కూల్‌ స్టూడెంట్సే. మంచి కథతో వస్తే... సినిమా తీయాలని కొంత ఫండ్‌ పక్కన పెట్టడం కూడా జరిగింది. ‘స్క్రిప్ట్‌ ల్యాబ్‌’ అని వాళ్లు ఓ కేటగిరీ పెట్టుకున్నారు. ప్రస్తుతం కథలు తయారు చేసుకుంటున్నారు. ఆ సినిమా నుంచి మేం లాభాలేవీ ఆశించడం లేదు. నాన్‌–ప్రాఫిటబుల్‌ వెంచర్‌గా చూస్తున్నాం. నాన్నగారి కల అది (ఫిల్మ్‌ స్కూల్‌). ఆయన మాకు ఇచ్చింది చాలు! ఆయన కల నుంచి మేం డబ్బులు సంపాదించాలనుకోవడం లేదు.

అమలకు నేను చెప్పను... అమల నాకు చెప్పదు!
రీసెంట్‌గా అమల ఓ హిందీ సినిమా అంగీకరించింది. రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్‌లో. కథేంటి? అని అమలను అడగలేదు. నా సినిమా కథలను అమలకు చెప్పను. అలాగే, తను చేయబోయే సినిమా కథలను నాకు చెప్పదు (నవ్వులు). ‘మీరు హిందీలో చేసి చాలా రోజులైంది?’ అనడిగితే... ‘ఇప్పుడు నాకు మంచి రోల్స్‌ ఇస్తారా? నేను అక్కడికి వెళ్లి, వాళ్ల వెంటపడి... మంచి రోల్స్‌ ఇవ్వమని అడగడం ఎందుకు? మన దగ్గర బ్రహ్మాండమైన రోల్స్‌ వస్తున్నాయి కదా!’ అన్నారు నాగార్జున.

మండే మార్నింగ్‌ షో... వన్‌ డాలరే!
ఈ మధ్యన ఏమైందంటే... వీకెండ్స్‌ లేదా హాలిడేస్‌లో థియేటర్లకొస్తున్నారు. అందువల్ల, పండగలకు పెద్ద హీరోల సినిమాలను విడుదల చేస్తున్నారు. యాక్చువల్లీ... అమెరికాలో వీక్‌ డేస్‌లో టికెట్‌ రేటు 4 డాలర్లు, వీకెండ్స్‌లో 18 నుంచి 20 డాలర్ల వరకూ ఉంటోంది. ఎంత హిట్‌ సినిమా అయినా సోమ, మంగళ వారాల్లో 3, 4 డాలర్లు ఉంటోంది. మండే మార్నింగ్‌ షో అయితే ఒక్క డాలరే. ఇప్పుడిప్పుడే ఇటువంటి ట్రెండ్‌ బెంగళూరు, ముంబయ్‌లలో వస్తోంది. రెండు మూడేళ్లలో మన దగ్గరికీ వస్తుందనుకుంటున్నా!

వాట్‌ నెక్ట్స్‌?
నానితో ఓ సినిమా చర్చల దశలో ఉంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. బ్యూటిఫుల్‌ స్క్రిప్ట్‌! అన్నీ కుదిరితే... జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్‌ చేస్తాం. అందులో మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నా!

మరిన్ని వార్తలు